Focus Stocks: వారాంతంలో చివరి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్లలో విద్యుత్ రంగంలోని షేర్లు భారీగా పెరిగాయి. ఇంట్రాడేలో టాటా పవర్, అదానీ పవర్, ఎన్టీపీసీ, పీఎఫ్సీ, ఆర్ఈసీ షేర్లు అద్భుతమైన వృద్ధిని సాధించాయి. ఈ క్రమంలో పవర్ స్టాక్స్ 52 వారాల గరిష్ఠ స్థాయిలను తాకాయి.
దేశంలో ప్రస్తుతం విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరుగుతోంది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే విద్యుత్ వినియోగం దేశంలో 16 శాతం మేర పెరిగింది. భారీగా పెరుగుతున్న డిమాండ్ తీర్చేందుకు కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్రాల డిస్కామ్‌లతో పాటు.. కేంద్ర రాష్ట్ర ఉత్పత్తి సంస్థలను (జెన్‌కోస్) ఉత్పత్తి పెంచాలని ఆదేశించింది. ఇది గత వారం రికార్డు స్థాయిలో 241 గిగావాట్లను అధిగమించింది.

విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలకు చేరుకోవటంతో కంపెనీలు మంచి లాభాలను గడించే అవకాశం ఉంది. దీంతో నేడు మార్కెట్ల ముగింపు సమయంలో అదానీ పవర్ స్టాక్ ధర రూ.369 వద్ద, టాటా పవర్ స్టాక్ ధర రూ.268.85 వద్ద, ఎన్టీపీసీ స్టాక్ ధర రూ.240.25 వద్ద, పవర్ ఫైనాన్స్ కంపెనీ స్టాక్ ధర 13 శాతం పెరిగి రూ.306.40 వద్ద, ఆర్ఈసీ స్టాక్ ధర 10 శాతం పెరిగి రూ.269.90 వద్ద ప్రయాణాన్ని ముగించాయి. పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మెుగ్గుచూపటంతో ఈ కంపెనీల షేర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి.

ఇదిలా ఉండగా హైడ్రోయేతర పునరుత్పాదక వనరులపై బలమైన దృష్టితో భారతదేశ విద్యుత్ డిమాండ్ వచ్చే దశాబ్దంలో 70 శాతానికి పైగా పెరుగుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఫిచ్ గ్రూప్ BMI నివేదిక ప్రకారం.. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 2032 నాటికి ఉత్పత్తిలో మెజారిటీని కలిగి ఉంటుందని వెల్లడించింది. ఈ పరిస్థితులు బొగ్గు రంగంపై దేశం ఎక్కువగా ఆధారపడడాన్ని సూచిస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేటు పవర్ కంపెనీలు థర్మల్ పవర్ ప్రాజెక్టులను భారీగా కొనుగోలు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications