Jaguar Land Rover: టాటా మోటార్స్ కంపెనీ తాజాగా తన క్యూ4 ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో మార్చి 31, 2024తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో మొత్తం అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా టాటా మోటార్స్ 8 శాతం పెరిగి 3,77,432 యూనిట్లకు చేరుకుంది.
క్యూ4 FY24లో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల గ్లోబల్ హోల్‌సేల్స్ 1,55,651 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది విక్రయాలతో పోల్చితే దాదాపు 15 శాతం అధికమని కంపెనీ ప్రకటించింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ గ్లోబల్ హోల్‌సేల్స్, చైనాలోని చెరీ ఆటోమొబైల్స్‌తో జాయింట్ వెంచర్‌ను మినహాయించి అమ్మకాలు 1,10,190 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 16 శాతం పెరిగింది.

త్రైమాసికంలో జాగ్వార్ హోల్‌సేల్స్ 13,528 వాహనాలు కాగా, ల్యాండ్ రోవర్ హోల్‌సేల్స్ 96,662 వాహనాలుగా ఉన్నాయి. క్యూ4 ఎఫ్‌వై24లో టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాలు, టాటా దేవూ రేంజ్ 1,11,591 యూనిట్లను విక్రయించినట్లు టాటా మోటార్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ క్యూ4 డేటా ప్రకారం జాగ్వార్ ల్యాండ్ రోవర్ రిటైల్ అమ్మకాలు భారతదేశంలో ఏకంగా 81% పెరిగాయి. కంపెనీ అమ్మకాల వృద్ధికి రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్లు దోహదపడుతున్నట్లు వెల్లడైంది.
వాస్తవానికి టాటా మోటార్స్ తన అనుబంధ సంస్థ అయిన జాక్వార్ ల్యాండ్ రోవర్ కార్ల విక్రయాన్ని 2009లో భారత మార్కెట్లో ప్రారంభించింది. మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ పెరుగుదల కంపెనీ అత్యంత బలమైన పనితీరును సూచింది. గత ఐదేళ్లలో దాని అత్యధిక అమ్మకాల గణాంకాలను నమోదు చేసింది. ఈ క్రమంలో రేంజ్ రోవర్ అమ్మకాలు 160 శాతం పెరగగా.. డిఫెండర్ విక్రయాలు దాదాపు 120 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అలాగే ఏడాది ప్రాతిపదికన కొత్తగా విడుదల చేసిన డిస్కవరీ స్పోర్ట్ 2024 మోడల్లో 50 శాతం, రేంజ్ రోవర్ ఎవోక్‌కి 55 శాతం అమ్మకాల్లో పెరుగుదలను కంపెనీ గుర్తించింది. రానున్న సంవత్సరాల్లో వృద్ధిపై కంపెనీ నమ్మకంగా ఉందని JLR ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబ అన్నారు.


Click it and Unblock the Notifications