Tata News: ఈ ఏడాది వాహన రంగం భారీ వృద్ధిని కనబరిచింది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అన్ని విభాగాల్లోనూ చక్కటి పనితీరును చూపిస్తూ డిసెంబర్ త్రైమాసికాన్ని ఘనంగా ముగించింది.
డిసెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 137 శాతం పెరిగి 7 వేల 25 కోట్లకు చేరినట్లు నివేదించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికానికి 2 వేల 958 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. FY24 Q3లో మొత్తం ఆదాయం 25 శాతం పెరిగి లక్షా 10 వేల 577 కోట్లకు చేరగా.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 88 వేల 488 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది.

గతేడాది ఇదే కాలంలోని 3 వేల 202 కోట్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం పన్నుకు ముందు లాభం 7 వేల 493 కోట్లకు పెరిగినట్లు ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో JLR అమ్మకాలు 27 శాతం పెరిగాయని ఈ నెల ప్రారంభంలో టాటా గ్రూప్ తెలిపింది. UK ఆర్మ్డ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆదాయం డిసెంబర్ 2022 త్రైమాసికంలో 58 వేల 863 కోట్ల నుంచి గత త్రైమాసికంలో 76 వేల 665 కోట్లకు వృద్ధి చెందింది.
'మా వ్యాపారాలు విభిన్న వ్యూహాలను చక్కగా అమలు చేయడంతో బలమైన త్రైమాసికానికి ఫలితాలను పోస్ట్ చేశాం. తద్వారా 6 త్రైమాసికాల స్థిరమైన డెలివరీని అందించడం సంతృప్తికరంగా ఉంది. ఈ ఏడాదిని పటిష్టంగా ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. రాబోయే రోజుల్లో మా పనితీరును మరింత మెరుగుపరుచుకుంటాము' అని టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పిబి బాలాజీ తెలిపారు.
డెట్ టు ఈక్విటీ నిష్పత్తి గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 3.68 నుంచి ఈ ఏడాది Q3 నాటికి 1.58 రెట్లు తగ్గింది. గతేడాది Q3లో 7.71గా ఉన్న EPS గత త్రైమాసికంలో 18.32కి చేరుకుంది. ఇవాళ మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ తన ఆదాయాలను ప్రకటించింది. కాగా క్రితం రోజు ముగింపుతో పోలిస్తే BSEలో షేర్ల ధర కేవలం 45 పైసలు పెరిగి 878.80 వద్ధ స్థిరపడింది.


Click it and Unblock the Notifications