Tata motors: కారు కొనాలనుకుంటున్నారా..? సమయం లేదు మిత్రమా..త్వరపడాల్సిందే!
Tata motors: కారు కొనాలని చూస్తున్నారా..? అందులోనూ టాటా మోటార్స్ వెహికల్ తీసుకోవాలనుకునే వారు త్వరపడాల్సిందే. ఎందుకంటే కంపెనీ నుంచి ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. దాదాపు ఇంకో రెండు వారాల్లో కార్ల ధరలు పెంచనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. అన్ని మోడల్స్ మరియు వేరియంట్స్ పై పెరిగిన ధరలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని తెలిపింది.
టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలోని ఆయిల్ మరియు ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెంచనుంది. ఈ నిర్ణయంతో కొనుగోలుదార్లపై 0.6 శాతం అధిక భారం పడనుంది. జూలై 17 నుంచి తాజా పెంపు అమల్లోకి రానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇన్ పుట్ ఖర్చుల్లో హెచ్చుతగ్గుల కారణంగా ధరలు పెంచక తప్పలేదని పేర్కొంది.

అయితే ఇందులోనూ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేందుకు సిద్ధమైంది. జూలై 16లోపు వాహనాలు బుక్ చేసుకుని, జూలై 31లోపు డెలివరీ తీసుకుంటే ప్రస్తుత ధరనే పరిగణలోనికి తీసుకుంటామని వెల్లడించింది. కాగా ఈ ఏడాదిలో టాటా మోటార్స్ ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. జనవరిలో 1.2 శాతం, ఏప్రిల్ లో 0.6 శాతం చొప్పున పెంచగా, ఇప్పుడు మరో 0.6 శాతం వడ్డించనుంది.
మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఖర్చులు భారీగా పెరిగాయి. కార్ల తయారీలో వినియోగించే ఆయా వస్తువుల రేట్లు పెరుగుదలతో, దాని ప్రభావం వాహనాల ధరలపై పడింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే కంపెనీ ఖర్చులు దాదాపు 30 శాతం పెరిగాయి. వాహనాల ఉద్గారాలను పర్యవేక్షించేందుకు పరికరాలను అమర్చాలని ప్రభుత్వం ఆదేశించడం.. వాహనాల ధరలు పెరుగుదలకు దారితీసినట్లు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications