Tata News: టాటాలు ఎల్లప్పుడూ దేశం కోసం ముందువరుసలో ఉంటుంటారు. దేశంలోని అనేక కీలకమైన రంగాల్లో వ్యాపారాలను స్థాపించి ఇండియాను ప్రపంచ పఠంలో చేర్చటంలో టాటాల పాత్ర చాలా గొప్పది. తమకు వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలను తిరిగి ప్రజల కోసమే వెచ్చించటంలో ప్రపంచంలో టాటాలకు మించిన వ్యాపార సంస్థ ఉండబోదని చెప్పటం అతిశయోక్తి కాదు.
డిఫెన్స్ రంగంలో ఇండియా ఇప్పటికీ స్వయం సమృద్ధి సాధించలేదు. కీలకమైన రక్షణ పరికసరాలను ఇప్పటికీ విదేశీ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. రక్షణ రంగంలో విదేశీ కంపెనీల ఆధిపత్యం ఉంది. అయితే ఓ భారతీయ కంపెనీ విదేశాల్లో డిఫెన్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. అవును టాటా గ్రూప్ కంపెనీ విదేశాల్లో భారీ డిఫెన్స్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తుందనే వార్త పెద్ద సంచలనంగా మారింది. గ్రూప్ కంపెనీ అయిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ ప్లాంట్‌ను కాసాబ్లాంకాలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ మొదట్లో రాయల్ మొరాకో ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ కర్మాగారం సంవత్సరానికి 100 యుద్ధ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏడాదిలోగా ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇదే తరహా యుద్ధ వాహనాలను భారత సైన్యానికి కూడా సరఫరా చేస్తుంది. వీటిలో పరిమిత సంఖ్యలో వాహనాలు భారత సైన్యంతో సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాహనాలను లడఖ్ సరిహద్దు వెంబడి మోహరించారు. కంపెనీకి ఈ ఒప్పందం చాలా పెద్దదని, ముఖ్యమైనదని ఎండీ, సీఈవో సుకరన్ సింగ్ వెల్లడించారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ - డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO) సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి.
విదేశాల్లో భారతీయ కంపెనీ ఏర్పాటు చేసిన తొలి ప్రధాన రక్షణ విభాగం ఇదే కావటం గమనార్హం. విదేశాల్లో ఏ భారతీయ కంపెనీ కూడా చరిత్రలో ఇలాంటి సాహసం చేయలేదు. ఈ ప్లాంట్‌లో దాదాపు 350 మంది ఉద్యోగులు ఉంటారని, పనిలో ఎక్కువ భాగం భారతదేశంలో కూడా తయారు చేయబడుతుందని టాటా గ్రూప్ వెల్లడించింది. అనేక దశాబ్ధాలుగా రక్షణ రంగంలో సేవలు అందిస్తున్న టాటా గ్రూప్ ఇప్పటి వరకు రక్షణ, పారామిలిటరీ బలగాలు, లాజిస్టిక్స్, యుద్ధ అవసరాలతో సహా రాష్ట్ర పోలీసు బలగాల కోసం అనేక వాహనాలను తయారు చేసింది. ఈ క్రమంలో టాటా గ్రూప్ యుద్ధ విమానాలు, అధునాతన వాహనాలతో సహా తేలికపాటి వాహనాల తయారీపై కూడా దృష్టి సారించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications