Tata group news: కొత్త బిజినెస్‌లోకి టాటా గ్రూప్.. అదే జరిగితే మొదటి దేశీయ కంపెనీగా రికార్డ్
Semiconductor industry: ఇటీవల ఆపిల్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుని టాటా గ్రూప్ చరిత్ర సృష్టించింది. కాగా ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇది గనుక సాకారమైతే ఆ ఘనత సాధించిన మొదటి దేశీయ కంపెనీగా రికార్డ్ సొంతం చేసుకుంటుంది.
సెమీకండక్టర్స్ తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం పలు విధాల ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆ రంగానికి 76 వేల కోట్ల ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. దీంతో సెమీకండక్టర్ పరిశ్రమలో అవకాశాలను చేజిక్కించుకునేందుకు వివిధ కంపెనీలు పోటీపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వాటికి మంచి డిమాండ్ ఉండటంతో అందరి కళ్లూ దీనిమీదే ఉన్నాయి.

ఇప్పటివరకు అమెరికాకు చెందిన మైక్రాన్ మాత్రమే భారత్‌లో సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దేశీయ కంపెనీలు ఏవీ ఈ తరహా కార్యకలాపాల్లో పాలుపంచుకోలేదు. ఈ లోపాన్ని అధిగమించేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. అస్సాంలో 25 వేల కోట్లతో సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్దమైంది.
ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే సెమీకండక్టర్ పరిశ్రమలో అడుగుపెట్టిన మొట్టమొదటి దేశీయ కంపెనీగా టాటా గ్రూప్ చరిత్ర సృష్టించడం ఖాయం. అనుమతుల ప్రక్రియ చివరి దశలో ఉందని ఎలక్ట్రానిక్స్ మరియు IT శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పష్టం చేశారు. ప్రాజెక్టు మొత్తం వ్యయంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీని కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
టాటా గ్రూప్ ఈ మధ్య ఎలక్ట్రానిక్స్ తయారీపై ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. గత అక్టోబర్‌లో కర్ణాటకలోని విస్ట్రోన్ ఐఫోన్ తయారీ ప్లాంట్‌ను కొనుగోలు చేసింది. తద్వారా ఐఫోన్ తయారీ రంగంలోకి దిగింది. కాగా ఇప్పుడు టాటా గ్రూప్‌తో పాటు CG పవర్, గెయిన్స్ టెక్నాలజీ, ఫాక్స్‌కాన్-హెచ్‌సిఎల్ మరియు హిరానందని గ్రూప్ కూడా సెమీకండక్టర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించాయి.


Click it and Unblock the Notifications