iPhone: ఇండియాలో మరో ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్.. ఎక్కడ, ఎవరు కంట్రోల్ చేయనున్నారంటే..
Tata News: జనాల్లో ఐఫోన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న ఇండియాపై ఆపిల్ దృష్టి సారించింది. స్థానికంగా ఐఫోన్ తయారీకి మొగ్గు చూపింది. రతన్ టాటా సారథ్యంలోని టాటా గ్రూప్ ఇందుకోసం ముందుకు వచ్చింది. ఇప్పటికే ఒక ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించింది కూడా. అయితే ఇప్పుడు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రానున్న రెండు, మూడేళ్లలో భారత్ లో 50 మిలియన్లకు పైగా ఐఫోన్లను తయారు చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. దీన్ని చేరుకునేందుకు టాటా గ్రూప్ మరో అసెంబ్లీ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని చూస్తోందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. తమిళనాడులోని హోసూర్‌లో 20 అసెంబ్లీ లైన్లతో కూడిన ఫ్యాక్టరీని నిర్మించే ప్రణాళికలో ఉంది.

దాదాపు 50 వేల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుని.. అటు ఆపిల్ లేదా టాటా గ్రూపు ఇంకా ధ్రువీకరించలేదు. దేశంలో మొదటి ఐఫోన్ తయారీదారుగా నిలిచిన విస్ట్రోన్ ఇన్ఫోకామ్ లో 100 శాతం వాటాను 125 మిలియన్ డాలర్లు వెచ్చించి గత అక్టోబర్లో టాటా గ్రూపు సొంతం చేసుకుంది. దీనికి అదనంగా ఇప్పుడు కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. సరఫరా గొలుసును లోకలైజ్ చేయడానికి, టాటా గ్రూపుతో భాగస్వామ్యాన్ని బలపరుచుకోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందని ఆపిల్ భావిస్తోంది.
చైనాకు వెలుపల కార్యకలాపాలను నిర్వహించాలని చూస్తున్న ఆపిల్.. సెప్టెంబర్ త్రైమాసికంలో బలమైన రెండింతల ఆదాయ వృద్ధిని నమోదుచేసింది. దీంతో భారత మార్కెట్ పై దృష్టి సారించింది. టాటా గ్రూప్ కు చెందిన క్రోమా స్టోర్ల ద్వారా తన ఐఫోన్లను ఆపిల్ దేశంలో విక్రయిస్తోంది. కాగా తన సొంత రిటైల్ స్టోర్ ల ఉనికిని మరింత విస్తరించాలని చూస్తోంది. త్వరలో ఏర్పాటుకానున్న ప్లాంట్.. విస్ట్రోన్ నుంచి స్వాధీనం చేసుకున్న దానికంటే పెద్దగా ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications