Airbus News: సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అనేక వ్యాపారాల్లో విస్తరించి ఉన్న టాటా గ్రూప్ కీలక రంగాల్లో విస్తరణకు కొత్త డీల్స్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే విమానయాన రంగంలోని తయారీ పరిశ్రమను తాజాగా టార్గెట్ చేసిందని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే టాటా గ్రూప్ తాజాగా ఫ్రెంచ్ కంపెనీ ఎయిర్‌బస్‌తో కొత్త డీల్ చేసుకుంది. డీల్ ప్రకారం వీరు పౌర వినియోగంలోని హెలికాప్టర్‌లను దేశీయంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. మేక్ ఇన్ ఇండియా దృష్టిలో తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా శుక్రవారం తెలిపారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దిల్లీ పర్యటన సందర్భంగా చేసిన అనేక వాగ్దానాల్లో భాగంగా రెండు సంస్థలు H125 హెలికాప్టర్‌లను తయారు చేసేందుకు ఒప్పందం కుదిరింది.

చివరి అసెంబ్లీ లైన్ డీల్‌లో ప్రధాన కాంపోనెంట్ అసెంబ్లీలు, ఏవియానిక్స్ మరియు మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ హార్నెస్‌ల ఇన్‌స్టాలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్‌లు, ఫ్లైట్ కంట్రోల్స్, డైనమిక్ కాంపోనెంట్స్, ఫ్యూయల్ సిస్టమ్, ఇంజన్‌ల ఏకీకరణ జరుగుతుంది. మొదటి 'మేడ్ ఇన్ ఇండియా' H125 ల డెలివరీలు 2026లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ డీల్ దేశంలో హెలికాప్టర్ మార్కెట్ నిజమైన సామర్థ్యాన్ని అన్‌లాక్ చేస్తుందని ఎయిర్‌బస్ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ తెలిపారు.
దేశంలో మొట్టమొదటి హెలికాప్టర్ అసెంబ్లింగ్ సౌకర్యాన్ని ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయడం పట్ల టాటా గ్రూప్ సంతోషంగా ఉందని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ వెల్లడించారు. ఎగుమతి మార్కెట్ల కోసం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎయిర్‌బస్ H125 సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ల ఉత్పత్తి దీని ద్వారా జరుగుతుందని తెలిపారు. పైగా ఇది భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన H125 దేశంలో హెలికాప్టర్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.


Click it and Unblock the Notifications