Tata Group: 6 రోజుల్లో డబ్బులు డబుల్ చేసిన టాటా స్టాక్.. 13 ఏళ్ల రికార్డు ధరతో చరిత్ర..
Tata Shares: ఫిబ్రవరిలో టాటా గ్రూప్ కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తున్న పెట్టుబడిదారులకు నిజంగా అదృష్టం పట్టిందని చెప్పుకోవాలి. వరుసగా గ్రూప్ కంపెనీలు ఇన్వెస్టర్ల సంపదను అనేక రెట్లు పెంచుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టాటా గ్రూప్ కంపెనీకి చెందినTRF షేర్ల గురించే. ప్రస్తుతం కంపెనీ షేర్లు నిరంతరం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు పెరుగుతున్న ట్రెండ్‌ను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో నేడు షేరు ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. నేటి ట్రేడ్‌లో టాటా గ్రూప్ కంపెనీ TRF షేర్లు 7.7% పెరిగి 13 సంవత్సరాల గరిష్ట స్థాయి రూ.509.95ని తాకాయి. దీంతో వారం రోజుల్లో కంపెనీ షేర్ ధర దాదాపుగా 100 శాతం పెరిగి రెండింతలయ్యాయి.

టాటా స్టీల్-టీఆర్‌ఎఫ్ విలీన ప్రతిపాదనను రద్దు చేసినట్లు టాటా గ్రూప్ గత వారంలోనే ప్రకటించడంతో షేర్ల ధరకు రెక్కలొచ్చాయి. ఈ వార్త తర్వాత బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ టిఆర్‌ఎఫ్ లిమిటెడ్ షేర్లు 20 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకాయి. టాటా స్టీల్ పనితీరులో మెరుగుదల దృష్ట్యా అసోసియేట్ కంపెనీ టిఆర్‌ఎఫ్ లిమిటెడ్‌ను విలీనం చేయకూడదని బోర్డు సభ్యులు నిర్ణయించుకున్నట్లు టాటా స్టీల్ తెలిపింది.
దీనికి ముందు టాటా స్టీల్ దాదాపు 9 అనుబంధ సంస్థలను వ్యూహాత్మకంగా విలీనం చేయాలని భారీ ప్రణాళికను రచించిన సంగతి తెలిసిందే. ఇందులో టీఆర్‌ఎఫ్, టాటా స్టీల్ లాంగ్ ప్రాడక్ట్స్, టిన్ ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టాటా మెటాలిక్స్, ది ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్ మైనింగ్ లిమిటెడ్, ఎస్ అండ్ టి మైనింగ్ కంపెనీలు ఉండటం గమనార్హం.
టాటా స్టీల్ మైనింగ్ లిమిటెడ్ విలీనం సెప్టెంబర్ 1, 2023 నుంచి అమల్లోకి వస్తుందని, టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ విలీనం నవంబర్ 15, 2023 నుంచి అమలులోకి వస్తుంది. అలాగే డిసెంబర్ 1, 2023 నుంచి అమలులోకి వచ్చే S&T మైనింగ్ కంపెనీ లిమిటెడ్, జనవరి 15, 2024 నుంచి ది టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విలీనంతో పాటు టాటా మెటాలిక్స్ లిమిటెడ్ విలీనం ఫిబ్రవరి 1, 2024 నుంచి అమలులోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications