Tata Capital: బంగారం రుణాల్లోకి టాటా క్యాపిటల్..!
గోల్డ్ లోన్ లోకి టాటా క్యాపిటల్ అడుగు పెట్టింది. ఇందుకు త్రిస్సూర్‌కు చెందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) యోగ్‌లోన్స్‌లో లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. టాటా క్యాపిటల్ బోర్డు సోమవారం యోగ్‌లోన్స్‌లో రూ.318 కోట్లతో 88.6 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. యోగ్‌లోన్స్ కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 162 బ్రాంచీలను నడిపిస్తోంది. 2026 మార్చి 31 నాటికి దీని నిర్వహణలో ఉన్న ఆస్తుల (AUM) విలువ రూ.708 కోట్లుగా ఉంది. వీరికి 32,000 మంది వినియోగదారులు ఉన్నారు.
అనుభవజ్ఞుడైన ఉన్నికృష్ణన్ ఇడిచరం వీటిల్ నేతృత్వంలో యోగ్‌లోన్స్ కొనసాగుతోంది. అయితే టాటా క్యాపిటల్ మెజారిటీ వాటా కొనుగోలు చేసినా ఆయనే కొనసాగనున్నారు. ఆయనకు గతంలో మణప్పురం ఫైనాన్స్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన యోగ్‌లోన్స్ మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఉన్నారు. టాటా క్యాపిటల్ అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా ఉంది. 2026 మార్చి నాటికి రూ.2.77 ట్రిలియన్ల నికర ఏయూఎం (AUM)ను కలిగి ఉంది.లోన్ బుక్ లో 58.3 శాతం రిటైల్ రుణాలు, 27.4 శాతం చిన్న, మధ్య తరహా సంస్థల రుణాలు, 14.3 శాతం కార్పొరేట్ రుణాలు ఉన్నాయి.

కాగా మే నెలాఖరు నాటికి ఎన్‌బీఎఫ్‌సీల బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో గత ఏడాదితో పోలిస్తే 69 శాతం వృద్ధి చెందింది. ఇది రూ.3.3 ట్రిలియన్లకు చేరుకుంది. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత, యోగ్‌లోన్స్ తమ అనుబంధ సంస్థగా మారుతుందని టాటా క్యాపిటల్ తెలిపింది. ఈ కొనుగోలుతో టాటా క్యాపిటల్ బంగారు రుణాల వ్యాపారంలోకి ప్రవేశిస్తోందని టాటా క్యాపిటల్ ఎండీ, సీఈఓ అయిన రాజీవ్ సభర్వాల్ అన్నారు. యోగ్‌లోన్స్ నికర విలువ రూ.115 కోట్లు కాగా, దాని బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో 2021-22, 2025-26 మధ్య 25 శాతం సమ్మేళన వార్షిక వృద్ధి రేటుతో పెరిగింది.
బంగారం రుణాలు కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. బంగారం ధర పెరుగుదలతో చాలా మంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు భారీగా పసిడిపై రుణాలు ఇస్తున్నాయి. పుత్తడి వాల్యూలో దాదాపు 50 శాతం వరకు రుణం ఇస్తారు. దీంతో బంగారంపై రుణం తీసుకున్నవారు సకాలంలోనే రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. అందుకే పసిడి రుణాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications