టారిఫ్ చాలా తక్కువగా ఉన్నాయి, ఈ ఆదాయం సరిపోదు: ఎయిర్‌టెల్
ప్రస్తుతం టెలికం పరిశ్రమ కొంత గాడిన పడుతున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ టారిఫ్స్ ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని భారతీయ ఎయిర్ టెల్ సీఈవో (ఇండియా, సౌత్ ఏసియా) గోపాల్ విట్టల్ అన్నారు. కనీస ధర సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్)ని ఆయన కోరారు. తమ వద్ద ఉన్న స్పెక్ట్రం అండ వల్ల కంపెనీ మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు.

ఈ ఆదాయం సరిపోదు..
AGR బకాయిల నేపథ్యంలో జనవరి-మార్చి క్వార్టర్‌కు గాను భారతీ ఎయిర్‌టెల్ ఫలితాలు రూ.5,237 కోట్ల నష్టాన్ని ప్రకటించాయి. ఏజీఆర్ బకాయిలకు కేటాయించడంతో నష్టాలు వచ్చాయి. పెట్టుబడిపై కంపెనీకి తగిన ప్రయోజనం కలగాలంటే కస్టమర్ పైన సగటు ఆదాయం (ARPU) రూ.154 ఏమాత్రం సరిపోదని గోపాల్ విట్టల్ చెప్పారు. స్వల్పకాలంలో ఆర్పు రూ.200, రూ.300 అవుతుందని భావిస్తున్నామన్నారు. అప్పుడే వ్యాపారం ఆశించిన మేర ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

వారికీ సేవలు అందించే సమర్థత
ఆర్పు ప్రస్తుత స్థాయిల వద్ద ఉన్నప్పటికి కూడా రూ.100 లేదా అంతకంటే తక్కువ చెల్లింపు సామర్థ్యం ఉన్న వారికి సేవలు అందించే సమర్థవంతమైన స్థితిలో ఉన్నామని గోపాల్ విట్టల్ చెప్పారు. రాబోయే ఏడాదికి మూలధన వ్యయ కేటాయింపులు తక్కువగా ఉండవచ్చునని చెప్పారు.

డిసెంబర్‌లో 40 శాతం పెరుగుదల
గత క్వార్టర్‌లో ఆర్పు రూ.154గా ఉందని, 2012 అక్టోబర్ - డిసెంబర్‌లో రూ.135గా ఉందని గుర్తు చేశారు. ఏడాది క్రితం అదే క్వార్టర్‌లో రూ.123గా ఉందని చెప్పారు. 2G నుండి 4G అప్ గ్రేడ్ చేయడం వల్ల కొంత పెరుగుదల కనిపించినప్పటికి తమ టారిఫ్స్ మాత్రం తక్కువే ఉన్నాయని చెప్పారు. 2016లో జియో ఎంట్రీ తర్వాత టారిఫ్స్ భారీగా పడిపోయాయి. అయితే 2019 డిసెంబర్ నాటికి 40 శాతం పెరుగుదల కనిపించింది.


Click it and Unblock the Notifications