Swiggy News: స్విగ్గీ సంచలనం.. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ, కానీ ఏపీలో స్విగ్గీ బాయ్ కాట్..
Swiggy Bolt Service: దేశీయ ఫుడ్ డెలివరీ స్టార్టప్ స్విగ్గీ చాలా కాలంగా తన ఐపీవోను మార్కెట్లోకి ఫ్లోట్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సెబీ నుంచి అనుమతుల కోసం దరఖాస్తు పత్రాలను సమర్పించింది. ఇలాంటి కీలక సమయంలోనే కంపెనీ అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీలో ప్రత్యర్థి జొమాటోకు ముచ్చెమటలు పట్టించే ఆఫర్‌తో ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.
అవును శుక్రవారం స్విగ్గీ సీఈవో రోహిత్ కపూర్ దీనికి సంబంధించి అతిపెద్ద ప్రకటన చేశారు. స్విగ్గీ బోల్ట్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. దీని కింద కస్టమర్లకు కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తొలుత ఈ సర్వీస్ దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు రోహిత్ పేర్కొన్నాను. కంపెనీ శుక్రవారం బోల్ట్ సర్వీస్ ట్రయల్ రన్‌ను కొన్ని నగరాల్లో నిర్వహించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఇలాంటి పోటీ క్విక్ కామర్స్ రంగంలోని కంపెనీల మధ్య చూశాం. తొలుత జెప్టో దీనిని స్టార్ట్ చేయగా తర్వాత బ్లింకిట్, స్విగ్గీ ఇన్టామార్ట్, బిగ్ బాస్కెట్, కంట్రీ డిలైట్ వంటి ఇతర ఆటగాళ్లు సైతం వేగంగా డెలివరీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

స్విగ్గీ బోల్డ్ సేవలు ప్రస్తుతం ఆరు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, దిల్లీ, పూణేలోని ఫుడ్ లవర్స్ బోల్ట్ సర్వీసెస్ కింద 10 నిమిషాల్లోనే ఆహారాన్ని వేడిగా ఆర్డర్ చేసేందుకు కంపెనీ వీలు కల్పించింది. అయితే బోల్ట్ కస్టమర్లు తమకు రెండు కిలోమీటర్ల పరిధిలో ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుంచి మాత్రమే ఫాస్ట్ ఫుడ్ డెలివరీ అందుకునేందుకు అవకాశం ఉంది. ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందిన 10 నిమిషాల్లో డెలివరీపై ప్రస్తుతం కంపెనీ తన దృష్టిని పెట్టిందని తెలుస్తోంది. అలాగే ఐస్ క్రీం, స్వీట్లు, స్నాక్స్ వంటి రెడీ టు ప్యాక్ వంటకాలపై కూడా దృష్టి సారించనున్నట్లు స్విగ్గీ తెలిపింది.
14 నుంచి స్విగ్గీ బ్యాన్.. ఏమైందంటే..
ఆంధ్రప్రదేశ్ హోటల్ యాజమాన్యాలు తాము స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించాయి. అక్టోబర్ 14 నుంచి స్విగ్గీలో అమ్మకాలు నిలిపేస్తున్నట్లు ప్రకటన సైతం విడుదల చేశాయి. వాస్తవానికి నగదు చెల్లింపుల్లో స్విగ్గీ తమను ఇబ్బందులకు గురిచేస్తోందని హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే తాము అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.వి స్వామి వెల్లడించారు. ఇప్పటికే పలు దఫాలుగా స్విగ్గీ, జొమాటోతో చర్చలు జరపగా జొమాటో సానుకూలంగా స్పందించిందని వారు తెలిపారు. కొన్ని రెస్టారెంట్లకు చెల్లించాల్సిన సొమ్మను స్విగ్గీ సెటిల్ చేయాలని వారు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications