Swiggy: స్విగ్గీతో ప్రభుత్వం ఒప్పందం.. పండుగ సీజన్ లక్ష్యంగా వినూత్న ప్రయోగం
Swiggy: కిలోమీటర్ల తరబడి నడుచుకుంటూ సంతలకు వెళ్లి, కావాల్సిన వస్తువులు తెచ్చుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడంతా ఈ-కామర్స్ దందా నడుస్తోంది. ఏది కావాలన్నా ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ లో ఆర్డర్ చేస్తే అరగంటలో చేతికొస్తుంది. దీనివల్ల ఇటు వినియోగదారులు, అటు కార్పొరేట్ కంపెనీలు లాభపడుతున్నా.. తోపుడుబండ్ల వ్యాపారులు, చిన్నపాటి సంస్థలు నష్టపోతున్నాయి.
అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. సరిగ్గా ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గోవా ప్రభుత్వం స్విగ్గీతో జతకట్టింది. త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుండగా.. పుడ్ డెలివరీ సంస్థ భాగస్వామ్యంతో 'చవత్ ఇ-బజార్ 2023'ని ప్రారంభించింది. తద్వారా స్థానిక వ్యాపారులకు మద్ధతుగా నిలిచేందుకు సిద్ధమైంది.

'స్విగ్గీ మినిస్'లో ఇ-బజార్ సేవలు మొదలుపెట్టేందుకు సదరు సంస్థతో గోవా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ రాష్ట్ర CM ప్రమోద్ సావంత్ దీనిని గురువారం ఆవిష్కరించారు. స్థానిక మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఈ ఆన్ లైన్ డెలివరీ ప్లాట్ ఫారమ్ ద్వారా విక్రయించనున్నారు.
చిన్నపాటి వ్యాపారులకు ఆన్ లైన్ యాక్సెస్ అందించడంతో పాటు పండుగ సీజన్లలో వారి కస్టమర్ బేస్ ను విస్తరించడం లక్ష్యంగా గోవా ప్రభుత్వం
ఈ పథకం రూపొందించింది. దీనిద్వారా ఆయా ఉత్పత్తుల తయారీదారులకు అవకాశాలు సృష్టించవచ్చని ప్రమోద్ సావంత్ సర్కారు భావిస్తోంది. 25 కంటే ఎక్కువ ప్రాంతీయ ఉత్పత్తులను ఈ సర్వీస్ ద్వారా అందించాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications