Swiggy News: పెంపుడు జంతువుల కోసం స్విగ్గీ మరో ఇనీషియేటివ్.. నేషనల్ పెట్స్ డే రోజున ప్రకటన
Swiggy pet services: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌గా ప్రస్థానం ప్రారంభించిన స్విగ్గీ.. ఇతర విభాగాల్లోకి సైతం అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. తమ డెలివరీ భాగస్వాములను వివిధ కార్యకలాపాల కోసం వినియోగించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా పెంపుడు జంతువుల విషయంలో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమైంది.
తప్పిపోయిన పెంపుడు జంతువులను కనుగొనడంలో డెలివరీ భాగస్వాముల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడానికి స్విగ్గీ ప్రయత్నిస్తోంది. 'స్విగ్గీ పాలీస్(Swiggy Pawlice)' పేరిట ఓ కొత్త ఇనీషియేటివ్‌ను ప్రారంభించింది. ఎవరికైనా ఈ తరహా ఇబ్బంది ఎదురైతే వారు యాప్‌లో రిపోర్ట్ చేయవచ్చు. నేషనల్ పెట్ డే సందర్భంగా ఏప్రిల్ 11న స్విగ్గీ ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది.

ఇటీవల 'పా-టెర్నిటీ(Paw-ternity)' పాలసీని ప్రవేశపెట్టడంతో పెంపుడు జంతువుల సంరక్షణ మరియు దత్తతపై ఉద్యోగులకు మద్దతు ఇస్తామని కంపెనీ తెలిపింది. కాగా ఇప్పుడు కొత్త ఇనీషియేటివ్‌తో CEO రోహిత్ కపూర్ వాటిపై ప్రేమను చాటుకున్నారు. ఈ చొరవలో 3.5 లక్షల మంది డెలివరీ భాగస్వాములతో కూడిన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటామని స్విగ్గీ పేర్కొంది.
'పెంపుడు జంతువు తప్పిపోయిందనే ఆందోళన, వేదనను నేను ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నాను. ఇలాంటి బాధాకరమైన సంఘటన ఎవరికీ జరగకూడదని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. అలా జరిగితే స్విగ్గీ పాలీస్ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. జంతువులను పెంచుకునే వారు తమ తప్పిపోయిన పెట్స్ గురించి నేరుగా స్విగ్గీ యాప్ ద్వారా నివేదించవచ్చు. అవసరమైన వివరాలతో పాటు ఫొటోలను అందించవచ్చు' అని రోహిత్ కపూర్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications