Swiggy: ఒక్క ఆర్డర్ కూడా రాలేదంటూ స్విగ్గీ CEO ఎమోషనల్ పోస్ట్.. కంపెనీలో బిగ్ బి ఫ్యామిలీ ఇన్వెస్ట్‌మెంట్
Swiggy CEO post: దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటోలకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ పేరు ప్రఖ్యాతలు ఒక్కరోజులో వచ్చినవి కాదు. ఏళ్ల తరబడి కష్టానికి ప్రతిఫలమిది. ఈరోజుల్లో ఒక సంస్థను నెలకొల్పి, దానిని విజయ పథంలో నడిపించడం కత్తి మీద సాము వంటిదే. అటువంటి దాన్ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్న స్విగ్గీ CEO.. కంపెనీ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
ఈ ఏడాది ఆగస్టు నాటికి స్విగ్గీ తన ప్రస్థానం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మొదటిరోజు లాంచ్ గురించి కంపెనీ CEO మరియు వ్యవస్థాపకులు శ్రీహర్ష మెజాటీ మాట్లాడారు. మొదటి రోజు తమకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదని తెలిపారు. ఆ తర్వాత రోజు ఒక్క ఆర్డర్ తో తమ ప్రయాణం ప్రారంభమైనట్లు వెల్లడించారు. రోజుకు కేవలం 2 ఆర్డర్స్ నుంచి మొదలుపెట్టి 7 వేల 261 చేరుకున్నట్లు వివరించారు. మా జర్నీలో ఎంత దూరం వచ్చామో తిరిగి చూసుకుంటే మాకే ఆశ్చర్యం కలుగుతుందన్నారు.

'ఫుడ్ డెలివరీ కాన్సెప్ట్ కొత్తగా ప్రారంభించిన రోజుల్లో మాకు సహకరించిన రెస్టారెంట్ భాగస్వాములకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు మాపై నమ్మకం ఉంచి ప్రోత్సహించినందుకు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము. వారు నా దృష్టిలో కేవలం భాగస్వాములే కాదు, మా వ్యాపారానికి మూలస్తంభాలుగా నిలిచారు. కాగా ప్రస్తుతం దాదాపు 3 లక్షల రెస్టారెంట్లతో కలిగి ఉన్నామని ప్రకటించడానికి గర్వపడుతున్నాను. 'స్విగ్గీ ఇట్' అంటూ దేశప్రజలు ఇంటిల్లిపాది ఉపయోగించే పదంగా మారిపోవడం పట్ల ఆనందంగా ఉంది' అని శ్రీహర్ష లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు.
స్విగ్గీ జర్నీ పట్ల, భవిష్యత్తు వృద్ధి అవకాశాలపై ఇన్వెస్టర్లకు ఎంతో నమ్మకం ఏర్పడింది. దీంతో దాని క్విక్ కామర్స్ ప్లాట్ ఫారం ఇన్‌స్టామార్ట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా స్విగ్గి తో పాటు ఇన్‌స్టామార్ట్‌లో కొంత మొత్తం పెట్టుబడులు పెట్టినట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. 15 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్ టార్గెట్‌తో త్వరలో IPOగా రానున్న నేపథ్యంలో ఈ పెట్టుబడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే బిగ్ బి ఎంత మేర ఇన్వెస్ట్ చేశారో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications