చెన్నై: తమిళనాడులో తాము బాగా అభిమానించే వారికి లేదా రాజకీయాల్లో ఉండి జనాలకు మంచి చేసిన వారికి అభిమానంతో గుడిని కట్టడం తెలిసిందే. తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటు కేంద్రం తీసుకు వచ్చిన వివిధ పథకాల పట్ల ఆకర్షితుడైన ఓ రైతు ప్రధాని నరేంద్ర మోడీకి గుడి కట్టారు. మోడీ తీసుకు వచ్చిన పిఎం కిసాన్ సహా వివిధ పథకాలు జనాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

మోడీ గుడికి రూ.1.2 లక్షలు
ప్రధాని మోడీకి గుడి కట్టిన రైతు శంకర్. ఆయన వయస్సు 50. తమిళనాడు తిరుచ్చిరాపల్లిలోని ఎరకుడిలో ఆయన గుడి కట్టారు. శంకర్ తన పొలంలోనే ఈ గుడిని నిర్మించి, ప్రతిరోజు పూజలు చేస్తున్నారు. ఈ గుడి నిర్మాణానికి దాదాపు రూ.1.2 లక్షలు ఖర్చు చేశారు. ఈ గుడిని గత వారం ప్రారంభించారు. తిరుచ్చిరాపల్లికి 63 కిలో మీటర్ల దూరంలో ఎరకుడి ఉంటుంది. ప్రతి రోజు హారతి ఇచ్చి పూజ చేస్తారు.

కుంభాభిషేకం చేసే ఆలోచన
ఈ గుడిని ఎనిమిది నెలల క్రితం ప్రారంభించానని, గత వారం పూర్తవడంతో ప్రారంభించానని శంకర్ చెప్పారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో రైతులు ఎంతో లబ్ధి పొందుతున్నారన్నారు. అలాగే మోడీ వ్యక్తిత్వం కూడా తనను ఆకర్షించిందన్నారు. ప్రస్తుతం కుంభాభిషేకం చేయాలనే ఆలోచన ఉందని, ఇటీవల మమల్లాపరం చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా మోడీ వచ్చారని, అప్పుడు కలుద్దామనుకున్నానని, కానీ వెళ్లినప్పటికీ కలవలేకపోయానన్నారు.

వీరి ఫోటోలు కూడా..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద తనకు కూడా రూ.2000 వచ్చాయని, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ అందిందని, అలాగే టాయిలెట్ ఫెసిలిటీ కలిగిందని చెప్పారు. పీఎం కిసాన్ స్కీం కింద రైతుకు రూ.6వేలు కేంద్రం ఇస్తోన్న విషయం తెలిసిందే. ప్రజల కోసం ఎంతో చేస్తున్నారన్నారు. ఈ ఆలయంలో దేవుడి చిత్ర పటాలు కూడా ఉంచారు. వీటితో పాటు మాజీ సీఎం జయలలిత, తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోటోలు కూడా పెట్టారు.

బీజేపీ కార్యకర్త కాదు.. కానీ
శంకర్ బీజేపీ కార్యకర్త కూడా కాదు. కానీ మోడీ తెచ్చిన పథకాలతో రైతులు, సామాన్యులు ఆనందంగా ఉన్నారని గుడి కట్టారు. బీజేపీ తిరుచ్చిరాపల్లి జోనల్ ఇంచార్జ్ కన్నన్ మాట్లాడుతూ.. సదరు రైతు పార్టీ కార్యకర్త లేదా వర్కర్ కాదని, అయితే తాను తన పార్టీ ఆఫీస్ బేరర్స్‌ను సదరు రైతు వద్దకు పంపించానని, పార్టీలో చేరమని కోరానని చెప్పారు.


Click it and Unblock the Notifications