భారత్‌లో రూ.70 వేలకోట్ల పెట్టుబడి పెట్టనున్న సుజుకి..ఆటో రంగంలో విప్లవాత్మక మార్పులు
భారతదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి (MSIL) మాతృ సంస్థ అయిన సుజుకి మోటార్ కార్పొరేషన్ (SMC).. రాబోయే 5-6 సంవత్సరాలలో సుమారు రూ. 70 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి మంగళవారం గుజరాత్‌లో ప్రకటించారు.గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి తోషిహిరో సుజుకి కలిసి కంపెనీ తొలి గ్లోబల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV) e-VITARAను ఆవిష్కరించారు.భారతదేశంలో ఎలక్ట్రోడ్-స్థాయి స్థానికీకరణతో తయారు చేసిన తొలి లిథియం-అయాన్ బ్యాటరీ మరియు సెల్ ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా తోషిహిరో సుజుకి మాట్లాడుతూ.. భారతదేశం గ్రీన్ మొబిలిటీ వైపు దూసుకెళ్తోందన్నారు. ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం మా గౌరవంగా భావిస్తున్నాం. రాబోయే 5 నుంచి 6 సంవత్సరాల్లో రూ. 70 వేల కోట్ల పెట్టుబడి పెట్టి వికసిత భారత్ లక్ష్యానికి తోడ్పడతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మారుతి సుజుకి రెండు ప్రధాన రాష్ట్రాలలో (హర్యానా,గుజరాత్) లో ఉత్పత్తి యూనిట్లను నడుపుతోంది. కంపెనీ 2030-31 నాటికి 4 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.

ఇది ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి దాదాపు రెండింతలుగా చెప్పుకోవచ్చు. హన్సల్‌పూర్ ప్లాంట్ భవిష్యత్తులో 1 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండబోతోంది. దీంతో, ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ సౌకర్యం ద్వారా సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ వాహనం e-VITARA ను తయారు చేసి జపాన్, యూరప్‌తో సహా 100కి పైగా దేశాలకు ఎగుమతి చేయనుంది.
ఈ ప్రాజెక్ట్‌లో మరో ముఖ్యమైన మైలురాయి భారతదేశపు తొలి లిథియం-అయాన్ బ్యాటరీ మరియు సెల్ ఉత్పత్తి ప్రారంభాన్ని చెప్పుకోవచ్చు. ఇది తోషిబా-డెన్సో-సుజుకి సంయుక్త ప్లాంటులో తయారవుతుంది. జపాన్ నుండి వచ్చే ముడి పదార్థం కొన్ని సెమీకండక్టర్ భాగాలను ఉపయోగిస్తున్నప్పటికీ, మిగతా ఉత్పత్తి పూర్తిగా భారతదేశంలోనే జరుగుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ కు ముఖ్యమైన మద్దతు అవుతుందని కంపెనీ తెలిపింది.
2030-31 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండింతలు పెంచడాన్ని సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది. EVలు, హైబ్రిడ్ వాహనాలు, బ్యాటరీ ఉత్పత్తిలో ముందంజలో ఉండడం, హన్సల్‌పూర్‌ను ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తి హబ్ గా మార్చడం, భారతదేశాన్ని కేంద్రంగా చేసుకుని గ్లోబల్ ఎగుమతులను పెంచడం వంటి వాటిని టార్గెట్ చేసుకుంది. Suzuki పెట్టుబడి ప్రణాళిక భారత ఆటో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. భారతదేశ గ్రీన్ మొబిలిటీ లక్ష్యానికి, విక్సిత్ భారత్ దిశగా పయనానికి ఒక పెద్ద బలం కానుంది.


Click it and Unblock the Notifications