Suzlon Stock: సుజ్లాన్ ఇన్వెస్టర్ల కోలాహలం.. స్టాక్ 10% అప్ వెనుక ఇదే కారణం..
Suzlon Energy Shares: ఇటీవల కొంత ఒడిదొడుకులకు లోనైన సుజ్లాన్ కంపెనీ షేర్లు నేడు భారీగా పుంజుకున్నాయి. ఇంట్రాడేలో సుజ్లాన్ స్టాక్ ధర 10 శాతం పెరుగుదలను చూసింది. దీనికి నేడు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. నేడు కంపెనీ షేర్లు భారీగా లాభపడటంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.లక్ష కోట్ల మార్కును దాటింది. దీంతో వరుసగా 8 ట్రేడింగ్ సెషన్ల నుంచి బేజారిన సుజ్లాన్ స్టాక్ తిరిగి పుంజుకుని సరికొత్త రికార్డులను సృష్టించటానికి సిద్ధం అవుతోంది.
ముందుగా నేడు విండ్ ఎనర్జీ కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాండ్ గతంలో ఉన్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచబడింది. వాస్తవానికి సుజ్లాన్ స్టాక్ అడిషనల్ సర్వైలెన్స్ మెజర్ ఫ్రేమ్‌వర్క్ నుంచి తీసివేయబడిన తర్వాత ప్రైస్ బ్యాండ్ రివిజన్ జరిగింది. ఇక కంపెనీ షేర్ల పెరుగుదలకు మరో కారణాన్ని పరిశీలిస్తే.. టాటా పవర్ కంపెనీ ప్లాన్ చేస్తున్న 3 గిగావాట్ల సామర్థ్యంతో విండ్ టర్బైన్లను సరఫరా చేసేందుకు ఆహ్వానించిన బిడ్లలో కంపెనీ కూడా పార్టిసిపేట్ చేస్తోందని వెల్లడైంది. నివేదికల ప్రకారం సీమెన్స్ గేమ్‌సా, సెన్వియన్ ఇండియా, ఇన్విజన్ ఎనర్జీ వంటి విండ్ టర్బైన్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులతో పాటు ప్రస్తుతం పోటీ రేసులో కంపెనీ కొనసాగుతోంది. కంపెనీ ఈ ఆర్డర్ గెలుచుకుంటే స్టాక్ ధర రానున్న కాలంలో మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక నేడు ఇట్రాడేలో కంపెనీ షేర్లు ఏకంగా 10 శాతం ఎగబాకటానికి వెనుక ఒక కీలకమైన అంశం ఉంది. ఆగస్ట్ 2024లో సుజ్లాన్ ఎనర్జీ, రెనమ్ ఎనర్జీ సర్వీసెస్‌లో 76 శాతం వాటా కోసం సంజయ్ ఘోదావత్ గ్రూప్‌కు రూ.660 కోట్లను రెండు విడతలుగా చెల్లించనున్నట్లు ప్రకటించింది. తొలి విడతలో 51 శాతం వాటాను రూ.400 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటనలో పేర్కొంది. మొదటి విడత కొనుగోలు చేసిన 18 నెలల్లోపు మరో 25 శాతం వాటాకు రూ.260 కోట్లకు కొనుగోలు చేయాలని కంపెనీ ప్లాన్ చేసింది. కంపెనీ ఆర్డర్ బుక్ ప్రస్తుతం 5 గిగావాట్లకు పెరిగింది.
దీనికి ముందు కొన్ని రోజుల కిందట విండ్ ఎనర్జీ కంపెనీ ఎన్ఎస్ఈ, బీఎస్ఈల నుంచి వార్నింగ్ లెటర్స్ అందుకుంది. గతంలో ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజీనామా సమయంలో చట్టపరమైన కార్పొరేట్ పరిపాలన పాటించటంలో విఫలమైనట్లు ఆందోళన వ్యక్తం చేయటంపై వార్నింగ్ లెటర్స్ వచ్చాయి. దీనిపై కంపెనీ స్పందిస్తూ వ్యాపారంపై ఈ లెటర్ ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోదని పేర్కొంది. గడచిన ఏడాది కాలంలో స్టాక్ తన ఇన్వెస్టర్లకు 185 శాతం రాబడిని అందించింది. ఈ క్రమంలో 2023 అక్టోబర్ 9న స్టాక్ ధర రూ.27.69 స్థాయి నుంచి ప్రస్తుత స్థాయిలకు ఎగబాకింది. బ్రోకరేజ్ అంచనాలకు అనుగుణంగా కంపెనీ షేర్లు తిరిగి పుంజుకోవటంపై ఇన్వెస్టర్లు సైతం జోరుగా బెట్టింగులు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications