హైదరాబాద్ (Hyderabad) అంటేనే కలల నగరం. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలు వెతుక్కుంటూ రాష్ట్రం నలుమూలల నుంచి జనం ఇక్కడికి వస్తుంటారు. అయితే, భాగ్యనగరంలో నివసిస్తున్న వారికి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన, కాస్త ఆందోళన కలిగించే విషయం బయటపడింది. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ , కుల సర్వే (SEEEPC) 2024 ప్రకారం.. హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉన్నవారి సంఖ్య రాష్ట్రంలోనే అతి తక్కువగా ఉందట!

అద్దె ఇళ్లే రాజ్యం ఏలుతున్నాయి!
ఈ సర్వే వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే, హైదరాబాద్‌లో మెజారిటీ జనాభా అద్దె ఇళ్లలోనే తలదాచుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో కేవలం 23.08 శాతం మందికి మాత్రమే సొంత ఇల్లు ఉంది. అంటే మిగిలిన 70.63 శాతం మంది అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అద్దెకు ఉండేవారు అత్యధికంగా ఉన్న జిల్లా కూడా హైదరాబాద్ కావడం గమనార్హం. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, దానికి ఆనుకుని ఉన్న మెడ్చల్-మల్కాజిగిరి (35.26%), రంగారెడ్డి (35.56%) జిల్లాల్లో కూడా సొంత ఇళ్ల శాతం చాలా తక్కువగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లోనే సొంత ఇళ్లు ఎక్కువ
నగరానికి, పల్లెటూరికి మధ్య ఉన్న అసలు తేడాను ఈ సర్వే కళ్ళకు కట్టినట్లు చూపించింది. నగరాల్లో అద్దె ఇళ్లు ఎక్కువైతే, పల్లెల్లో మాత్రం సొంత ఇళ్లకే ప్రాధాన్యం ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నారాయణపేట్ జిల్లాలో 68.88 శాతం మందికి సొంత ఇల్లు ఉంది. ఆ తర్వాత వనపర్తి (67.02%), జోగులాంబ గద్వాల (65.21%) జిల్లాలు వరుస స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ అద్దెకు ఉండేవారి శాతం చాలా తక్కువ. ఉదాహరణకు నారాయణపేట్‌లో కేవలం 26.17 శాతం మంది మాత్రమే అద్దె ఇళ్లలో ఉంటున్నారు.
ఎందుకీ అంతరం?
హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొనడం అనేది సామాన్యుడికి ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది. రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకడం, ఐటీ రంగం విస్తరణతో భూముల రేట్లు పెరగడం వల్ల చాలామంది ఇల్లు కొనే బదులు అద్దెకు ఉండటమే బెటర్ అని భావిస్తున్నారు. మరోవైపు, ఉద్యోగ రీత్యా బదిలీలు ఉండటం, ఐదేళ్ల తర్వాత ఇక్కడ ఉంటామో లేదో అన్న అనిశ్చితి వల్ల కూడా ఐటీ ఉద్యోగులు అద్దె ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వంశపారంపర్యంగా వచ్చే ఇళ్లు ఉండటం, స్థలం తక్కువ ధరకే దొరకడం వంటి కారణాల వల్ల అక్కడ ఓనర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.
మొత్తానికి హైదరాబాద్ అంటే కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు, అది ఇప్పుడు "రెంటల్ హబ్" గా కూడా మారిపోయింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే హౌసింగ్ స్కీమ్‌లు లేదా సరసమైన ధరల్లో ఇళ్ల నిర్మాణం చేపడితే తప్ప, సామాన్యుడి సొంత ఇంటి కల నెరవేరడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications