Rapido: బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడోకు సుప్రీం కోర్టులో కొంత ఉపశమనం లభించింది. ర్యాపిడోకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన స్టే నోటీసుపై ఢిల్లీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్‌తో కూడిన వెకేషన్ బెంచ్ తెలిపింది.
ఢిల్లీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది మనీష్ వశిష్ట్ మాట్లాడుతూ... తుది పాలసీని ప్రకటించే వరకు హైకోర్టు నోటీసుపై స్టే విధించడం రాపిడో రిట్ పిటిషన్‌ను వాస్తవంగా అనుమతించడం లాంటిదన్నారు. మే 26న రాపిడో పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తూ.. తుది విధానాన్ని ప్రకటించే వరకు బైక్-టాక్సీ అగ్రిగేటర్‌పై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

బైక్ టాక్సీ సేవలను తక్షణమే నిలిపివేయాలని ఫిబ్రవరి 2023లో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ పబ్లిక్ నోటీసు జారీ చేసింది. యాప్ ఆధారిత అగ్రిగేటర్లు వాణిజ్య అనుమతులు లేకుండా రోడ్డుపై బైక్ ట్యాక్సీలను నడపకుండా నిరోధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ హెచ్చరించింది. మోటారు వాహనాల చట్టం, 1988ని ఉల్లంఘింతే కంపెనీలకు లక్ష వరకు జరిమానా విధిస్తామని రవాణా శాఖ పేర్కొంది.
నగర పాలక సంస్థ ఇచ్చిన ఈ షోకాజ్‌ను రాపిడో సవాలు చేసింది. వివిధ ప్రాథమిక మరియు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడంతో పాటు సహజ న్యాయ సూత్రాలకు ఈ ఆదేశాలు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. తగిన విధివిధానాలు రూపొందించే వరకు ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీనిని సవాలు చేస్తూ, స్థానిక సర్కారు సుప్రీం తలుపు తట్టింది. తదుపరి విచారణ కోసం అటు ఢిల్లీ ప్రభుత్వం, రాపిడో సహా వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications