Adani: పార్లమెంటుతో పాటు దేశంలో ప్రకంపనలు రేపుతున్న అదానీ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ విషయంపై కోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ విశాల్ తివారీ తన వాదనలు వినిపించారు. వాటితో ఏకీభవించిన అత్యున్నత న్యాయస్థానం.. పెట్టుబడిదారుల సంపదను రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నియంత్రణ సంస్థల అభిప్రాయం కోరింది.

న్యాయమూర్తుల ఆందోళన
అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక వల్ల అదానీ కంపెనీల్లో ఏర్పడిన సంక్షోభానికి సంబంధించిన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్లు విచారణకు వచ్చాయి. భారతీయ పెట్టుబడి దారులకు చెందిన లక్షల కోట్ల రూపాయలకు నష్టం వాటిల్లిందన్న వార్తలపై న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఏమి చర్యలు తీసుకుంటున్నారు?
ఇన్వెస్టర్ల పెట్టుబడిని కాపాడేందుకు, ప్రస్తుత వ్యవస్థను మెరుగుపరిచేందుకు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇవ్వాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)ని ధర్మాసనం కోరింది. పది లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తుండగా.. ఈ వ్యవహారంలో సెబీ సహా ఇతర నియంత్రణ సంస్థలు ఏమి చర్యలు తీసుకుంటున్నాయని ప్రశ్నించింది. త్వరలోనే అన్ని విషయాలూ కోర్టుకు నివేదిస్తామని సెబీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానమిచ్చారు.

విచారణ వాయిదా
ప్రస్తుతం ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా మెరుగుపరచవచ్చు అనే విషయాలను కోర్టు ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలో అవసరమైతే ప్రత్యేక నిపుణుల కమిటీని సైతం నియమించుకోవచ్చని సూచించింది. సెక్యూరిటీల నిపుణులు, అంతర్జాతీయ న్యాయ మరియు ఆర్థిక వేత్తలు, రిటైర్డ్ న్యాయమూర్తి అందులో ఉండాలని తెలిపింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ, సెబీ నివేదికలు సమర్పించాలంటూ ఈనెల 13కు విచారణను వాయిదా వేసింది.


Click it and Unblock the Notifications