ఎస్‌బిఐ (SBI) రీసెర్చ్ నివేదిక విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచం యుద్ధ భయాలు, చమురు సంక్షోభం, 'సూపర్ ఎల్ నినో' వంటి ముప్పుల మధ్య ఉన్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను ఓ సారి పరిశీలిస్తే.. చారిత్రక ఆధారాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
అయితే 2007 నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం అమెరికా ఇంధన విషయంలో స్వయం సమృద్ధి సాధించడం, అక్కడి ప్రజలకు పన్ను వాపసుల రూపంలో ప్రభుత్వ మద్దతు ఉండటం కొంత సానుకూల అంశం. అయినప్పటికీ 2026 నాటికి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. ఇది రవాణా, ఉత్పత్తి ఖర్చులను పెంచి, సామాన్యులపై ద్రవ్యోల్బణ భారాన్ని మోపుతుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న దేశాల ఆర్థిక లోటు పెరిగే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ (IMF) హెచ్చరిస్తోంది.
ప్రపంచ దేశాలు సంక్షోభంలో ఉన్నప్పటికీ, భారతదేశం మాత్రం బలమైన పునాదులతో ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.6 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేయడం దీనికి నిదర్శనం. గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా భారత్ 9 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. కాబట్టి, ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని నివేదిక భరోసా ఇస్తోంది.

భారతదేశంలో వసంతకాలపు Super El Nino (ఫిబ్రవరి-మే) సమయంలో దేశంలోని సుమారు 30% ప్రాంతాల్లో సాధారణం కంటే సగటున 26% తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అదే సమయంలో, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వేసవి ఎల్ నినో సంభవిస్తే, దేశంలోని దాదాపు 15% ప్రాంతాల్లో సగటున 22% తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది.ఈ వివరాలు 2024 డిసెంబర్ 11న లోక్‌సభలో శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఎల్ నినో ప్రభావం సమయంలో భారతదేశ నైరుతి రుతుపవనాలు సాధారణంగా బలహీనపడతాయని, దాని తీవ్రత ఎల్ నినో బలంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
1950 నుంచి ఇప్పటివరకు 16 ఎల్ నినో సంవత్సరాలు నమోదవగా, వాటిలో 7 సంవత్సరాల్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా రుతుపవనాల చివరి దశలో, సెప్టెంబర్ నెల వర్షపాతంపై ఎల్ నినో ప్రతికూల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొన్నారు. అంటే, ఈసారి ఎల్ నినో ప్రమాదం ఉంటే, వర్షాకాలం ప్రారంభంలోనే కాకుండా చివరి దశ వరకు కూడా ప్రభావం కొనసాగవచ్చు.
ఐసీఆర్ఐఈఆర్ (Indian Council for Research on International Economic Relations) జూన్ 2014 వర్కింగ్ పేపర్ 276ను ఉటంకిస్తూ, State Bank of India రీసెర్చ్ తెలిపిన ప్రకారం 1950 నుంచి భారతదేశం 13 కరువులను ఎదుర్కొంది. వాటిలో 10 ఎల్ నినో సంవత్సరాల్లో, ఒకటి లా నినా సమయంలో సంభవించాయి.అయితే, ఎల్ నినో మరియు భారతదేశ కరువుల మధ్య సంబంధం పూర్తిగా ప్రత్యక్షం గానీ, ఎప్పుడూ ఒకేలా ఉండేదీ కాదని నివేదిక స్పష్టం చేసింది. అంటే ప్రతి ఎల్ నినో వచ్చినప్పుడల్లా కరువు వస్తుందనేది తప్పు. కానీ 1980 తర్వాత ఈ సంబంధం మరింత బలపడినట్లు కనిపిస్తోంది.
ప్రత్యేకంగా 21వ శతాబ్దంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. గత 14 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన నాలుగు ఎల్ నినో ఘటనల్లో, మూడు భారతదేశంలో కరువు లాంటి పరిస్థితులకు దారితీశాయి. అంటే, ఇప్పుడు ఈ ముప్పును గతంతో పోలిస్తే మరింత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. నివేదికలో మరో ముఖ్యమైన అంశం భారత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు. వ్యవసాయ స్థూల విలువ జోడింపు (Agri GVA)లో అనుబంధ కార్యకలాపాల వాటా 2012 ఆర్థిక సంవత్సరంలో 35% ఉండగా, 2024 నాటికి దాదాపు 46%కు పెరిగింది.
అంటే, భారత వ్యవసాయం ఇప్పుడు కేవలం సాంప్రదాయ పంటలపై మాత్రమే ఆధారపడటం లేదు. పాడి పరిశ్రమ, పశుపోషణ, ఉద్యానవనం మరియు ఇతర అనుబంధ రంగాల ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా, ఎల్ నినో ప్రభావం గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత పరిమితంగా ఉండవచ్చని నివేదిక అంచనా వేస్తోంది.
అయితే ముందు ముందు సూపర్ ఎల్ నినో, వాతావరణ ముప్పులు పొంచి ఉన్నాయని నివేదిక తెలిపింది. ఆర్థిక పరమైన సవాళ్లతో పాటు వాతావరణ మార్పులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 2026లో 'సూపర్ ఎల్ నినో' ఏర్పడే అవకాశం 61 శాతం ఉందని నివేదిక పేర్కొంది. ఇది సంభవిస్తే దక్షిణ ఆసియాలో రుతుపవనాలు బలహీనపడవచ్చు. ఆస్ట్రేలియా, అమెజాన్ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చు. భారతదేశంలో ముఖ్యంగా సెప్టెంబర్ నెల వర్షపాతంపై దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం వాతావరణ సమస్యే కాకుండా, ఆహార ధాన్యాల ధరలు పెరగడానికి, ఆహార భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉంది.
గతంతో పోలిస్తే భారత వ్యవసాయ రంగం ఇప్పుడు మరింత వైవిధ్యంగా మారింది. కేవలం సాంప్రదాయ పంటలపైనే కాకుండా పాడి పరిశ్రమ, పశుపోషణ, ఉద్యానవన పంటల వాటా (సుమారు 46 శాతానికి) పెరిగింది. ఈ మార్పు కారణంగా ఎల్ నినో ప్రభావం వ్యవసాయ రంగంపై గతంలో అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఎస్‌బిఐ రీసెర్చ్ భావిస్తోంది. క్వాంటైల్ రిగ్రెషన్ మోడల్ ద్వారా ఎస్‌బిఐ చేసిన విశ్లేషణ ప్రకారం.. కేవలం ఎల్ నినో వల్ల భారత జీడీపీ వృద్ధిపై పెద్దగా ప్రభావం ఉండదు. అయితే, ఎల్ నినోతో పాటు కరువు కూడా సంభవిస్తే, జీడీపీ వృద్ధి రేటు సగటున 20 బేసిస్ పాయింట్ల నుండి గరిష్టంగా 65 బేసిస్ పాయింట్ల వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే, వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారితే ఆర్థిక వృద్ధి కొంత మందగించవచ్చు.
మొత్తంగా చూసినట్లయితే.. పెరుగుతున్న ఇంధన ధరలు, వాతావరణ మార్పులు సవాలుగా మారినప్పటికీ, భారతదేశం తన అంతర్గత ఆర్థిక బలం, వైవిధ్యభరితమైన వ్యవసాయ రంగం ద్వారా ఈ సంక్షోభాన్ని అధిగమించగలదని నివేదిక సారాంశంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications