జకర్తా: అంతర్జాతీయ పౌర విమానయాన యవనికపై మరో కొత్త సంస్థ పుట్టుకొచ్చింది. సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రయాణ ఛార్జీలతో ఆ సంస్థ తన కార్యకలాపాలను ఆరంభించనుంది. ఈ విమానయాన సంస్థ పేరు సూపర్ ఎయిర్ జెట్ (Super Air Jet). ఇండోనేషియా ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులను ప్రారంభించడానికి సమాయాత్తమౌతోందా సంస్థ యాజమాన్యం. దీనికి అవసరమైన లైసెన్స్‌ను ఆ దేశ ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే మంజూరు చేసింది.
ఇండోనేషియాకు చెందిన లయన్ ఎయిర్ గ్రూప్‌లో ఇదీ ఓ భాగంగా భావిస్తోన్నారు. సూపర్ ఎయిర్ జెట్ విమానాలను నడిపించడానికి అవసరమైన లైసెన్స్‌ను మంజూరు చేసినట్లు ఇండోనేషియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చీఫ్ నోవీ రియాంటో తెలిపారు. ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్‌ను జారీ చేశామని స్పష్టం చేశారు. సాంకేతిక, భద్రతాపరమైన అంశాలపై సమగ్రమైన డేటాను సంబంధిత పౌర విమానయాన సంస్థ యాజమాన్యం అందించినట్లు పేర్కొన్నారు. అవి సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు.

ప్రారంభంలో సూపర్ ఎయిర్‌జెట్ విమానయాన సంస్థ 180 సీట్ల సామర్థ్యాన్ని కలిగిన మూడు విమానాలను అందుబాటులోకి తీసుకుని వస్తుంది. ఎయిర్‌బస్ ఎస్ఈ ఏ320 పేరుతో వాటిని నడిపిస్తామని ఎయిర్ జెట్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అరి అజరీ తెలిపారు. తొలుత డొమెస్టిక్ సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని, క్రమంగా దాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తామని పేర్కొన్నారు.
బడ్జెట్ విమానాలుగా వాటిని తెస్తామని, ఇతర పౌర విమానయాన సంస్థలతో పోల్చుకుంటే- ప్రయాణ ఛార్జీ తక్కువే ఉంటుందని అన్నారు. అనేక ద్వీపాలను కలిగి ఉన్న ఇండోనేషియాకు విదేశీ పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో అత్యుత్తమ పర్యాటక దేశంగా గుర్తింపు పొందింది ఇండోనేషియా. ప్రపంచ దేశాల్లో పౌర విమానయాన రంగంలో ఆరో అతిపెద్ద దేశంగా కొనసాగుతోంది. సొంతంగా విమానాలను నడిపించడానికి ఆ దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతుంటారు.


Click it and Unblock the Notifications