అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఆల్ఫాబెట్ (Google's parent company) గత కొన్ని నెలల్లో మార్కెట్‌లో అద్భుతమైన పునరుజ్జీవనాన్ని సాధించింది. 2023 ప్రారంభం నుంచి ఇప్పటివరకు, అల్ఫాబెట్ షేర్లు దాదాపు 120% రిటర్న్ ఇచ్చిన నేపథ్యంలో కంపెనీ ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకుంది. కానీ ఈ కథలో నిజమైన హైలైట్. ఈ విజయానికి నాయకత్వం వహించిన సుందర్ పిచాయ్ బిలియనీర్‌గా ఎదగడం.

2025 నాటికి సుందర్ పిచాయ్ నికర సంపద అందరూ ఆశ్చర్యపోయేలా $1.1 బిలియన్ (రూ. 9,000 కోట్లు)కు చేరింది. ఈ స్థాయికి చేరిన వారు చాలామంది స్టార్టప్‌లు స్థాపించి, వాటి షేర్ల విలువల ద్వారా సంపద సృష్టించారు. కానీ పిచాయ్ మాత్రం స్థాపకుడు కాకుండానే, ఒక ఉద్యోగిగా ప్రారంభించి, సీఈవోగా ఎదిగారు. ఇది నిజంగా అరుదైన ఉదాహరణ.
మార్క్ జుకర్‌బర్గ్ (Meta), జెన్సెన్ హువాంగ్ (Nvidia) లాంటి వారు తమ కంపెనీలను స్థాపించి వాటి వృద్ధితో కలిసి ఎదిగారు. కానీ పిచాయ్ గూగుల్‌ను స్థాపించలేదు. ఆయన 2004లో గూగుల్‌లో ఉద్యోగిగా చేరారు. క్రోమ్ , Maps, డ్రైవ్ లాంటి ప్రాజెక్టులకు నాయకత్వం వహించి విజయవంతం చేశారు. అదే ఆయనకు 2015లో గూగుల్ CEOగా పదవి తెచ్చిపెట్టింది. అనంతరం 2019లో ఆల్ఫాబెట్ CEOగా ప్రమోట్ అయ్యారు.
ఆల్ఫాబెట్ షేర్లు 2025లో పెద్ద ఎత్తున ఎగసిపోయాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభంలోనే 4.1% వృద్ధిని సాధించడం రెండు నెలల్లోనే అత్యధిక లాభం. కంపెనీ AI రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతుండటమే దీనికి ముఖ్య కారణం. 2025లో ఒక్క AI పెట్టుబడికే $10 బిలియన్ల పెరుగుదల జరిగి, మొత్తం $85 బిలియన్లకి చేరింది. ఈ విషయంపై పిచాయ్ వ్యాఖ్యానం చేస్తూ, "AIతో మా వ్యాపార విభాగాలన్నీ బలంగా ఎదుగుతున్నాయి. ఇది మాకు మోమెంటం ఇస్తోంది," అన్నారు.
ఒక చిన్న పట్టణం నుంచి ప్రపంచ వేదికపై దాకా:
పిచాయ్ ప్రయాణం చెన్నై అనే సాధారణ నగరంలో మొదలైంది. చిన్న వయసులోనే టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. IIT ఖరగ్‌పూర్ నుంచి మెటలర్జికల్ ఇంజినీరింగ్ చేసిన తరువాత, స్టాన్‌ఫర్డ్‌లో మాస్టర్స్, పెన్న్ యూనివర్శిటీలో MBA చేశారు. తర్వాత గూగుల్‌లో చేరిన ఆయన ఒక సాధారణ ఉద్యోగి నుంచి ప్రపంచ అత్యంత ప్రభావవంతమైన టెక్ CEO స్థాయికి ఎదిగారు.
పిచాయ్ సంపద కేవలం జీతం మీద మాత్రమే కాదు. బోనస్‌లు, స్టాక్ ఆప్షన్లు, అల్ఫాబెట్ షేర్లలో ఆయన కలిగిన 0.01% వాటా ఇవన్నీ కలిపి ఆయన సంపదను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. అంతేకాదు, అమెరికాలోని లాస్ ఆల్టాస్ హిల్స్‌లో విలాసవంతమైన ఇల్లు, పలు విలువైన కార్లు కూడా ఆయన జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. అదే సమయంలో, భారత్ మరియు అమెరికాలోని వివిధ సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం ద్వారా సమాజం పట్ల తన బాధ్యతను కూడా చాటారు.
సుందర్ పిచాయ్ జీవితం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. పెద్ద స్థాయికి చేరాలంటే తప్పనిసరిగా కంపెనీ స్థాపకుడే కావాలన్న నియమం లేదు. కృషి, నిబద్ధత, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఎవరికైనా విజయం సాధించడం సాధ్యమే. ఆయన ప్రయాణం యువతకి, ఉద్యోగాల్లో ఉన్నవారికి గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications