Sukanya Samriddhi Yojana: దేశంలో ఆడపిల్లలు కలిగిన చాలా మంది ప్రస్తుతం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన పథకాల్లో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. ఇది ప్రస్తుతం దేశంలోని ప్రజల్లో ఎక్కువ మందికి ఇష్టమైన పథకాల్లో ఒకటిగా కొనసాగుతోంది. మోదీ సర్కార్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మంచి రాబడితో పాటు భద్రతను కల్పించటం సక్సెస్ వెనుక కారణంగా ఉంది.
అయితే అక్టోబర్ 1 నుంచి సుకన్య సమృద్ధి ఖాతాకు సంబంధించిన రూల్స్ మార్పును కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీంతో పథకంలో వచ్చిన పెద్ద మార్పులను ఖాతాదారులు తప్పక తెలుసుకోవాలి. లేకపోతే సదరు ఖాతాలు మూసివేతకు గురయ్యే ప్రమాదం ఉంది. కుమార్తెల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఆలస్యం చేయకుండా మారిన రూల్స్ ప్రకారం నిబంధనలు పాటించటం అత్యవసరం. కొత్త రూల్స్ ప్రకారం ఇకపై తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు మాత్రమే కుమార్తె పేరుపై ఉన్న సుకన్య సమృద్ధి ఖాతాను నిర్వహించగలరు. ఈ రూల్ పాటించని ఖాతాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మోదీ సర్కార్ 2015లో తొలిసారిగా ఈ పథకాన్ని దేశంలో అమలులోకి తీసుకొచ్చింది. స్కీమ్ కింద కుమార్తె కోసం తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతా ఓపెన్ చేసి పెట్టుబడులను కొనసాగించటం ద్వారా మంచి రాబడిని పొందటంతో పాటు వారి పెళ్లి సమయానికి మంచి ఆర్థిక సాయం అందుతుంది. ఖాతాను అత్యంత తక్కువ సొమ్ము రూ.250తో తెరవవచ్చు. ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇందులో సొమ్మును డిపాజిట్ చేయవచ్చు. ప్రభుత్వం పొదుపు పథకాల్లో అత్యధికంగా 8.2 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
అలాగే కొత్త రూల్స్ ప్రకారం ఖాతాను చట్టబద్ధమైన సంరక్షకుడు కాని వ్యక్తి తెరిచినట్లయితే.. ప్రస్తుతం మారిన నిబంధనల ప్రకారం దానిని ఆమె సహజ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడికి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు చాలా గ్రామీణ ప్రాంతాల్లో తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, మావయ్య వంటి బంధువులు ఈ ఖాతాలను తెరచినట్లు ప్రభుత్వం గుర్తించింది.
అందుకే వాటిని వాస్తవ తల్లిదండ్రుల పేరుమీదకు మార్చాలని నేటి నుంచి అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలతో తప్పనిసరి చేయబడింది. ఎవరైనా వ్యక్తి తమ కుమార్తె 5 ఏళ్ల వయస్సు సమయంలో ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున పెట్టుబడిని ఆమెకు 21 ఏళ్లు వచ్చేంత వరకు కొనసాగిస్తే దాదాపు రూ.70 లక్షల వరకు రాబడిని అందుకునే అవకాశం ఉంటుంది. కుమార్తెకు 15 ఏళ్లు నిండిన తర్వాత చదువుల నిమిత్తం బ్యాలెన్స్‌లో 50 శాతం విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
పెట్టుబడిపై పన్ను ప్రయోజనాలను పరిశీలిస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మినహాయింపును పొందవచ్చు. ఒకవ్యక్తి కేవలం ఇద్దరు కుమార్తెలకు స్కీమ్ కింద ఖాతాను తెరిచేందుకు అవకాశం కల్పించబడింది. ఒకవేళ కవల పిల్లలు పుట్టిన సమయంలో మాత్రమే ముగ్గురి పేరుపై సుకన్య సమృద్ధి స్కీమ్ కింద ఖాతాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వబడింది.


Click it and Unblock the Notifications