Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి నిజాయితీ గురించి వెల్లడించిన సుధామూర్తి..
Infosys Murthy: ఇన్ఫోసిస్ దేశంలోని అగ్రగామి ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా ఉంది. టాప్-4 కంపెనీల్లో నిలిచిన ఈ సంస్థ విజయం వెనుక చాలా మంది కృషి దాగి ఉంది. ప్రధానంగా సహవ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి కంపెనీ కోసం తన జీవితంలో చాలా సమయాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే.
కంపెనీ విషయాల్లో నారాయణమూర్తి ఎంత నిబద్ధతతో ఉండేవారనే విషయాన్ని రుజువు చేసే ఒక సంఘటనను ఆయన భార్య సుధామూర్తి వెల్లడించారు. భర్త నారాయణమూర్తితో కలిసి ఒకసారి ఆమె కలకత్తా వెళ్లారు. అయితే ఆ సమయంలో నారాయణమూర్తి ఇన్ఫోసిస్ కంపెనీ పనిమీద వెళ్లగా.. సుధామూర్తి తన వ్యక్తిగత పనిమీద అక్కడికి వెళ్లారు.

కలకత్తాలో ఉండేందుకు హోటల్ యాజమాన్యాన్ని రెండు సింగల్ రూమ్స్ బుక్ చేయాల్సిందిగా నారాయణమూర్తి కోరారు. అయితే దీనికి భిన్నంగా హోటల్ వీరికి ఒక డబుల్ రూమ్ బుక్ చేసింది. దీనిని నారాయణమూర్తి తిరస్కరించారు. దీంతో భార్యాభర్తలకు విడివిడిగా రూమ్స్ బుక్ చేయటం ఏంటని అర్థం కాక అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయారు. అసలు నారాయణమూర్తి ఎందుకిలా అడుగుతున్నారనే విషయం వారికి అస్సలు అర్థం కాలేదు.
తాను కంపెనీ పనిమీద వచ్చానని, తన భార్య వ్యక్తిగత పనిపై వచ్చిందని ఆయన వెల్లడించారు. అందువల్ల తన భార్య హోటల్ ఖర్చును ఇన్ఫోసిస్ చెల్లించదని, ఆమె ఖర్చులను తన వాటిలో కలపొద్దని స్పష్టం చేశారు. సుధామూర్తి ఖర్చులను ఆమె చెల్లించుకుంటారని.. అందువల్ల రెండు విడివిడి సింగల్ రూమ్స్ ఇవ్వాలని కోరారు. లేని పక్షంగా ఇద్దరికి కలిపి చేసిన బిల్లులను రెండు భాగాలుగా విడదీయాలని నారాయణమూర్తి తేల్చి చెప్పారు. కంపెనీ విషయంలో ఇంతటి ట్రాన్పరెన్సీ పాటించేవారని సుధామూర్తి తన భర్త చేసిన పని గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications