Success Story: సాధారణ పేద రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగటం అంత సులువు కాదు. కానీ దీనిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన నారాయన్ మజుందార్ నిజం చేసి చూపారు. కేవలం రూ.3తో ప్రారంభమైన ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతోంది బెంగాల్‌లో మంచి గుర్తింపు పొందిన రెండ్ కౌ డెయిరీ విజయగాథ గురించే. కంపెనీ ప్రస్తుతం దేశంలో అతిపెద్ద డెయిరీల్లో ఒకటిగా కొనసాగుతోంది. అలాగే నారాయన్ మిల్క్‌మ్యాన్ ఆఫ్ ది ఈస్ట్ అనే గుర్తింపును పొందారు. వాస్తవానికి చదువుకునే రోజుల్లో ఫీజు చెల్లించేందుకు సైతం డబ్బులేక ఉదయం పాల బూతులో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేవాడు. అప్పట్లో రోజుకు రూ.3 అందుకునేవాడు. దీనికి తోడు బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్ షిప్ డబ్బుతో హర్యానాలోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి డైరీ టెక్నాలజీలో BSc పూర్తి చేశాడు.

పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని భులియా గ్రామంలో నివశించే నారాయణన్ కుటుంబం అతని చదువుకోసం ఎకరం భూమిని సైతం విక్రయించింది. చదువు పూర్తైన తర్వాత కోల్‌కతాలోని క్వాలిటీ ఐస్ క్రీమ్ కంపెనీలో డైరీ కెమిస్ట్‌గా చేరాడు. అత్యంత కష్టంమీద రోజూ ప్రయాణించి ఉద్యోగానికి వెళ్లినప్పటికీ అది మూడు నెలలకు బోరింగ్ గా మారింది. దీంతో సిలిగురిలోని మథర్ డెయిరీలో చేరాడు. ఆ తర్వాత పదోన్నతి పొందాడు. కానీ కొన్నాళ్లకు బహ్రెయిన్‌లోని డానిష్ డైరీలో పనికి వెళ్లాడు. తర్వాత మళ్లీ మథర్ డెయిరీకి వచ్చినా.. చివరికి ఠక్కర్ డెయిరీలో మైనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యాడు.
అలా వృత్తిలో విజయవంతంగా ముందుకు సాగుతూ.. 2003లో మజుందార్ ఠక్కర్ డెయిరీని విడిచిపెట్టి రెడ్ కౌ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించాడు. కంపెనీ తొలిరోజే 6340 లీటర్ల పాలను విక్రయించింది. తక్కువ సమయంలో నాణ్యమైన పాలను సేకరించి ప్రాసెస్ చేయడంతో రెడ్ కౌ డెయిరీ వృద్ధి పెరిగింది.ప్రస్తుతం కంపెనీ తన ఉత్పత్తులను తమిళనాడు, ఒడిశా, ఈశాన్య, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, నేపాల్‌లో విక్రయిస్తోంది. ప్రస్తుతం కంపెనీ డెయిరీ వ్యాపారంతో పాటు.. పాస్తా, సేమియా, మాకరోనీ, జ్యూస్‌లు, జామ్, పచ్చళ్లు సైతం విక్రయిస్తోంది. రైతులకు సకాలంలో పాల సొమ్మును వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయటంతో కంపెనీ మంచి గుర్తింపును పొందింది. ప్రస్తుతం కంపెనీ రూ.1,000 కోట్ల టర్నోవర్ దిశగా పయనిస్తోంది.


Click it and Unblock the Notifications