Success Story: ఇన్ఫోసిస్-యాక్సెంచర్ జాబ్స్ మానేసిన జంట, ఇలా ఏటా రూ.90 లక్షలు సంపాదన..
IT Couple Success Story: రిస్క్ తీసుకోకపోతే జీవితంలో మిగిలేది రస్కే అని మనలో చాలా మందికి తెలుసు. అయితే నేటి కాలంలో ఐటీ ఉద్యోగులు, డాక్టర్లకు ఉన్న డిమాండ్ బాహాటంగా తెలిసిందే. అయితే అధిక ఆదాయం ఉన్న ఈ రంగాలకు చెందిన చాలా మంది ప్రస్తుతం పెద్ద వేతనాలను తిరస్కరిస్తూ తమ సొంత వ్యాపారాలను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. చిన్నదైనా సొంత బిజినెస్ లో ఉంటే కిక్ వేరొకరి కింద ఎంత డబ్బుల కోసం పనిచేసినా రాదని యువత భావించటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఏపీకి చెందిన భార్యాభర్తల విజయగాథ గురించే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోటినాగ మణికంఠ, నాగ వెంకట దుర్గా పావని బీటెక్ గ్రాడ్యుయేట్స్. వీరు గతంలో ఇన్ఫోసిస్, యాక్సెంచర్ కంపెనీల్లో ఐటీ జాబ్స్ చేశారు. అయితే ఐటీ ఉద్యోగం కారణంగా దీర్ఘకాలంలో తమతోటి ఉద్యోగులు అనుభవిస్తున్న ఆరోగ్య సమస్యలను చూసి వారు తొందరగానే మేలుకున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కంటే ఆరోగ్యం ముఖ్యమని, ఒక్కసారి ఆరోగ్యం కోల్పోతే అన్నీ కోల్పోతామని వారు గ్రహించి సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారు గుంటూరులో 'శ్రేష్ఠే' అనే ఆర్గానిక్ ఫార్మింగ్ వెంచర్‌ను స్థాపించారు.

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో వారు వ్యవసాయం వైపు మళ్లినట్లు మణికంఠ, పావని వెల్లడించారు. ఇందుకోసం వారు సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో శిక్షణను కూడా పొందారు. అలా 2017లో శ్రేష్ఠేనుప్రారంభించడానికి రూ.17 లక్షల వరకు ఇన్వెస్ట్ చేశారు. అలా తొలినాళ్లలో సమీపంలోని వినియోగదారులకు మణికంఠ తానే స్వయంగా ఆర్గానిక్ ఉత్పత్తులను డెలివరీ చేసేవారు. అలా 2019లో తమ తొలి ఫిజికల్ స్టోర్ ప్రారంభించారు. కేవలం తాము పండించే పంటలతో పాటు అనేక మంది రైతులకు వీరు ఆసరాగా నిలుస్తూ వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు సహాయపడుతున్నారు. ఈ క్రమంలో బియ్యం నుంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, మిల్లెట్ ఆధారిత స్నాక్స్‌తో సహా దాదాపు 160కి పైగా ఆర్గానిక్ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తూ ఏటా ఈ యువ జంట రూ.90 లక్షల వ్యాపారాన్ని చేస్తోంది.
అయితే జీరో బడ్జెట్ ఫార్మింగ్ నేర్చుకోవటానికి ఈ క్రమంలో కొంత ఇబ్బంది పడినట్లు మణికంఠ జంట వెల్లడించారు. తాము చెన్నైలో పనిచేస్తున్న సమయంలో ట్రేనింగ్ కోసం వారాంతాల్లో ఏపీలోని లచ్చన్నగుడిపూడి గ్రామానికి వచ్చేవారమని తెలిపారు. ఏకకాలంలో అటు పనిని, ఇటు ట్రైనింగ్ కొనసాగించటం కష్టంగా ఉన్నప్పటికీ నచ్చిన పనిచేయటం కోసం వాటిని ఎదుర్కొన్నట్లు జంట వెల్లడించింది. చాలా మంది ప్రజలు నేచురల్ లివ్వింగ్ పై అవగాహన పెంపొందించుకుంటూ ముందుకు సాగుతున్న వేళ తాము కూడా ప్రకృతిని ప్రేమించే కస్టమర్‌లకు అదే తరహా ఆహారాన్ని అందించటానికి ప్రయత్నిస్తున్నట్లు మణికంఠ వెల్లడించారు. రసాయనాలు, ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ నుంచి సహజమైన, పర్యావరణ అనుకూలమైన జీవనశైలికి మారటానికి ప్రజలకు సహాయపడుతున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications