ఈ ఏడాది స్కూల్, కాలేజ్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఫారెన్ వెళ్లి చదువుకునేందుకు చాలా మంది ఇప్పటికే ప్లాన్స్ చేస్తుంటారు. అయితే ఒకప్పుడు ఇందుకు ఖర్చు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు. సాధారణంగా ఎంఎస్ లేదా పై చదువుల కోసం అమెరికా, కెనడా, లండన్ లో అడ్మిషన్ కోసం ట్రై చేస్తుంటారు. కానీ 2025 నుండి బ్రిటన్ లో చదుకునేందుకు ప్లాన్ చేసే వారు ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవడం చాల ముఖ్యం.
మీరు వచ్చే ఏడాది స్టూడెంట్ వీసాపై బ్రిటన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లండన్ యూనివర్శిటీలో చదువుకోవడానికి మెయింటెనెన్స్ ఖర్చు జనవరి 2025 నుండి £13,347కి(సుమారు 15లక్షలు) పెరగనుంది (ప్రస్తుత £12,006 కంటే 11.17 శాతం ఎక్కువ). స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ట్యూషన్ ఫీజు కాకుండా, మీరు 28 రోజుల పాటు మీ బ్యాంక్ అకౌంట్లో ఇంత బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది కనీస మొత్తం మాత్రమే. బ్రిటన్‌లో పెరుగుతున్న జీవన వ్యయం(cost of living) దృష్ట్యా ఈ మార్పు జరిగింది.

భారతీయ విద్యార్థులు ఎక్కువ సేవింగ్స్
దీనితో పాటు లండన్ కాకుండా బయట ప్రదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు బ్యాంక్ అకౌంట్లో ఒక సంవత్సరానికి ఇప్పుడు 9,207 పౌండ్లకు కాకుండా 10,224 పౌండ్లను(11లక్షలు) మెయింటెనెన్స్ ఖర్చు చూపించాలి, అంటే వచ్చే ఏడాది నుండి 11.05 శాతం పెరగనుంది. బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ కొత్త మార్పులు 2 జనవరి 2025 నుండి అమలులోకి రానున్నాయి.
దీనికి సంబంధించి కెరీర్ మొజాయిక్ జాయింట్ ఎండి మనీషా జవేరి మాట్లాడుతూ యుకె స్టూడెంట్ వీసా కోసం మెయింటెనెన్స్ ఖర్చు పెరగడం వల్ల భారతీయ విద్యార్థులు ఆర్థిక విషయాలపై ఎక్కువ జాగ్రత్త వహించాల్సి ఉంటుందని అన్నారు. దీనివల్ల విదేశాల్లో చదువుకోవడం ఇప్పుడు అధిక ఖర్చు కానుంది. ఇందుకు సరైన బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం లేదా స్కాలర్‌షిప్‌ల గురించి వివరంగా తెలుసుకోవడం అవసరం. కెరీర్ అవకాశాలు ఎక్కువ కాలం ఉండేలా అలాగే పెట్టుబడికి తగిన విధంగా విద్యార్థులు ప్లాన్ చేసుకోవాలి.
బ్యాంకు అకౌంట్లో పెద్ద మొత్తంలో డబ్బు
మెయింటెనెన్స్ డబ్బుతో పాటు స్టూడెంట్ వీసా కోసం బ్యాంక్ అకౌంట్లో ట్యూషన్ ఫీజు కూడా చూపించడం అవసరం. మీరు లండన్‌లోని కాలేజీకి అప్లయ్ చేసుకున్నట్లయితే ఇక్కడి ట్యూషన్ ఫీజు 20,000 యూరోలు(17లక్షల పైనే). వీసా కోసం అప్లయ్ చేయడానికి ముందు మీరు 5000 యూరోలు చెల్లించాలి. ఇప్పుడు, వీసా కోసం అప్లయ్ చేస్తున్నప్పుడు 13,347 పౌండ్ల మెయింటెనెన్స్ ఖర్చుతో పాటు మీరు 15,000 యూరోలు (20,000 - 5,000 యూరోలు) చూపించాలి. కాలేజ్ లండన్ కాకుండా బయట ఉన్నట్లయితే, అకౌంట్లో బ్యాలెన్స్ 10,224 పౌండ్లు చూపాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications