హార్ముజ్ జలసంధి మూసివేతపై ఇరాన్ కీలక ప్రకటన.. చమురు ధరలు పెరుగుదలపై మళ్లీ తీవ్ర ఆందోళన..
Strait of Hormuz Crisis: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్ నావికా మందుపాతరను (Naval Mine) ఢీకొనడంతో భారీగా మంటలు అంటుకున్నాయని ఇరాన్ సైన్యం శనివారం ధృవీకరించింది. మరోవైపు తమ హెచ్చరికలను బేఖాతరు చేసిన ఒక వాణిజ్య నౌకపై అమెరికా క్షిపణి దాడి జరిపి దానిని నిలిపివేసింది.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళం విడుదల చేసిన వివరాల ప్రకారం, సదరు ఆయిల్ ట్యాంకర్ తన సిగ్నలింగ్, గుర్తింపు వ్యవస్థలను (Identification systems) నిలిపివేసి జలసంధికి తూర్పున ఉన్న 'నిషిద్ధ' అనధికారిక మార్గం గుండా ప్రయాణించింది. ఈ క్రమంలో నావికా మందుపాతరను ఢీకొట్టడంతో నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఐఆర్‌జిసి అధికారిక వార్తా సంస్థ 'సెపా న్యూస్' తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవలి కాలంలో జలసంధిలోని అనధికారిక మార్గంలో మందుపాతరను ఢీకొని ప్రమాదానికి గురైన మూడో చమురు ట్యాంకర్ ఇది. జలసంధిలోని అన్ని రకాల ప్రమాదాలు మరియు బెదిరింపులను పూర్తిగా తొలగించే వరకు హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ నావికాదళం ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) సైనిక చర్య చేపట్టింది. ఇరాన్ ఓడరేవును సందర్శించిన అనంతరం ప్రాంతీయ జలాల నుంచి బయటపడటానికి యత్నించిన 'ఎం/వి హుడా' (M/V Huda - సెయింట్ కిట్స్ జెండా కలిగిన) వాణిజ్య నౌకను అమెరికా బలగాలు అడ్డుకున్నాయి. అమెరికా నావికా దిగ్బంధనాన్ని పదేపదే ఉల్లంఘిస్తూ, హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో అమెరికా సైనిక విమానం ఆ నౌక వెనుక భాగంపై అత్యంత ఖచ్చితత్వంతో కూడిన క్షిపణులను (Precision Missiles) ప్రయోగించి నౌకను నిలిపివేసింది. ఈ దాడికి ముందు పౌర సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా ఆదేశించింది.
అమెరికా నావికా దిగ్బంధన నిబంధనలకు కట్టుబడని 147 వాణిజ్య నౌకలను అమెరికా దళాలు వేరే మార్గాల్లోకి దారి మళ్లించాయని, ఇప్పటివరకు 5 వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుని నిలిపివేశాయని సెంట్కామ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (X) వేదికగా వెల్లడించింది.
ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా క్షిపణి దాడులు చేసిన నేపథ్యంలో ఈ యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి నిరసనగా హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును బిగించి, అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలు ఉన్న నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. ప్రతిగా అమెరికా కూడా ఇరాన్‌పై కఠిన నావికా దిగ్బంధనాన్ని విధించింది.
ప్రపంచవ్యాప్తంగా రవాణాయ్యే ముడి చమురులో దాదాపు ఐదో వంతు హార్ముజ్ జలసంధి గుండానే వెళుతుంది. వరుస ప్రమాదాలు, దిగ్బంధనాల కారణంగా ఈ వ్యూహాత్మక జలమార్గం మూతపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన సరఫరా నిలిచిపోయి చమురు ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
