Strait of Hormuz: స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఏమిటి? దీన్ని బ్లాక్ చేస్తే భారత్‌కు నష్టమేంటి?
ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హార్మో్జ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్బంధనాన్ని (Blockade) ప్రకటించడంతో, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడిచమురులో దాదాపు 20 శాతం ఈ సన్నని జలసంధి గుండానే వెళ్లాలి. ఇప్పుడు అక్కడ నెలకొన్న అనిశ్చితి వల్ల సామాన్యుడి నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అందరూ ఆందోళన చెందుతున్నారు.
పర్షియన్ గల్ఫ్ , గల్ఫ్ ఆఫ్ ఓమన్ మధ్య ఉన్న ఒక సన్నని జలసంధినే 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మకమైన సముద్ర మార్గం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడిచమురులో ఐదో వంతు (సుమారు 20%) ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. ఓమన్, ఇరాన్ దేశాల మధ్య ఉండే ఈ చిన్న మార్గం మూతపడితే, ప్రపంచ దేశాలకు చమురు సరఫరా నిలిచిపోయి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే దీనిని గ్లోబల్ ఎనర్జీ సప్లైకి 'చోక్ పాయింట్' అని పిలుస్తారు.
అసలేమిటీ దిగ్బంధనం? అమెరికా ప్లాన్ ఏంటి?
ఇరాన్ తన మొండివైఖరిని వీడాలని, యుద్ధ విరమణ చర్చలకు సహకరించాలని ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఈ 'బ్లాకేడ్' అస్త్రాన్ని ప్రయోగించింది. అంటే, ఇరాన్ ఓడరేవుల నుంచి ఏ నౌక బయటకు రాకుండా, లోపలికి వెళ్లకుండా అమెరికా నౌకాదళం అడ్డుకుంటుంది. అయితే, ఇది అంత సులభమైన పని కాదు. వేల సంఖ్యలో ప్రయాణించే ట్యాంకర్లను నియంత్రించడానికి అమెరికాకు భారీ స్థాయిలో యుద్ధ నౌకలు, సైనిక వనరులు అవసరమవుతాయి. పైగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం, ఆహారం , మానవతా సాయం అందించే నౌకలను అడ్డుకోవడం నేరం. దీనిని అమెరికా ఎలా బ్యాలెన్స్ చేస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ఆకాశాన్ని తాకుతున్న చమురు ధరలు
ఈ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పటికే మార్కెట్‌పై కనిపిస్తోంది. యుద్ధానికి ముందు బ్యారెల్ ముడిచమురు ధర 70 డాలర్లు ఉండగా, ఇప్పుడు అది 100 డాలర్లు దాటిపోయింది. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు లీటరుకు భారీగా పెరిగాయి. ఆసియా దేశాలు, ముఖ్యంగా భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆటోమేటిక్‌గా ఆకాశాన్ని తాకుతాయి.
కేవలం చమురు మాత్రమే కాదు.. ఆహార సంక్షోభం కూడా!
హార్మోజ్ జలసంధి (Strait of Hormuz) కేవలం చమురుకే కాదు, ఎరువులు , ఆహార పదార్థాల సరఫరాకు కూడా అత్యంత ముఖ్యం. ప్రపంచానికి అవసరమైన ఎరువులలో 30 శాతం ఈ మార్గం గుండానే వస్తుంది. ఈ దిగ్బంధనం వల్ల వ్యవసాయం దెబ్బతిని, అంతర్జాతీయంగా ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూఏఈ, ఖతార్ వంటి దేశాలు తమ ఆహార అవసరాల కోసం విమానాలపై ఆధారపడాల్సి వస్తే, అక్కడ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి.
ఇరాన్ ప్రతిఘటన ఎలా ఉంటుంది?
అమెరికా చర్యలకు ఇరాన్ కూడా దీటుగానే స్పందిస్తోంది. తమను అడ్డుకుంటే చిన్నపాటి వేగవంతమైన దాడి పడవలు (Fast-attack boats) , క్షిపణులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తామని హెచ్చరిస్తోంది. ఒకవేళ ఇరు దేశాల మధ్య ఘర్షణ పెరిగితే, ఈ జలసంధి పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం.



Click it and Unblock the Notifications