Market Closing: దీపావళికి లక్ష్మీ ఔట్లు పేలినట్లు నేడు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు సూపర్ లాభాలను తెచ్చిపెట్టాయి. మోదీ 3.0 ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేయటంతో మార్కెట్లలో బుల్స్ కోలాహలం కొనసాగింది.
ఈక్రమంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ సైతం సోమవారం నాడు తొలిసారిగా 51000 మార్కును అందుకుంది. మార్కెట్ల క్లోజింగ్ సమయంలో నిఫ్టీ సూచీ 733 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ సెన్సెక్స్ 2507 పాయింట్ల లాభంతో చివరికి స్థిరపడింది. ఈక్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1996 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1647 పాయింట్ల భారీ ర్యాలీని నమోదు చేశాయి. ప్రధానంగా ఎన్డీఏ కూటమి కూర్పుతో ప్రాధాన్యతా రంగాల్లో వృద్ధి, ఫోకస్ కొనసాగుతుందని దలాల్ స్ట్రీట్ బలంగా నమ్ముతోంది. విదేశీ ఇన్వెస్టర్లు సైతం తిరిగి మార్కెట్లలోకి తమ డబ్బును తీసుకొస్తున్నారు.

దీనికి తోడు నేడు భారత ఈక్విటీ మార్కెట్‌లో ర్యాలీకి ఎఫ్‌వై 24కి 8.2 శాతం అంచనాలకు మించి జీడీపీ వృద్ధి అంచనాలు సైతం కారణంగా నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆర్థిక లోటు తగ్గుదల, రుతుపవనాల ప్రారంభ పురోగమనం, మేలో జీఎస్‌టీ వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.73 లక్షల కోట్లకు చేరటం సైతం ర్యాలీకి దోహదపడ్డాయని వారు చెబుతున్నారు. టెక్ రంగంలోని కంపెనీల్లో పురోగతి, పెరిగిన రిటైల్ భాగస్వామ్యం ఈ పెరుగుదలకు గణనీయంగా దోహదపడ్డాయని అప్‌స్టాక్స్ డైరెక్టర్ పునీత్ మహేశ్వరి అన్నారు.
ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ టి, బీపీసీఎల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే సమయంలో ఐషర్ మోటార్స్, ఎల్టిఐఎమ్, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగించాయి తమ ప్రయాణాన్ని.


Click it and Unblock the Notifications