New Year 2021: 2020లో అంతలోనే ఇన్వెస్టర్లను మురిపించింది
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు 2020 సంవత్సరంలో భారీగా పతనమై, ఆ తర్వాత గోడకు కొట్టిన బంతిలా పైకి లేచాయి. గత రెండు నెలలుగా ప్రతి వారం సరికొత్త శిఖరాలను తాకాయి. కరోనా దెబ్బకు మార్చి ప్రారంభంలో కుప్పకూలిన మార్కెట్లు, 2020 ముగిసి, 2021లోకి ప్రవేశించే సమయానికి దూసుకెళ్లాయి. కరోనా సంక్షోభ సమయంలో 15 శాతం జంప్ చేశాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.32.48 లక్షల కోట్లు పెరిగింది.

అంతలోనే ఇన్వెస్టర్లను మురిపించింది
2020లో స్టాక్ మార్కెట్లు అత్యంత దారుణ పతనాన్ని, అదే సమయంలో అత్యంత ఎత్తులకు చేరి రికార్డులు సృష్టించాయి. 2021లోకి అత్యంత సానుకూల ధోరణితో అడుగు పెడుతున్నారు ఇన్వెస్టర్లు. 2020 జనవరి మధ్యలో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డ్ గరిష్టాన్ని తాకాయి. మార్చి మధ్యలో పతనం అయ్యాయి. అన్-లాక్ తర్వాత కోలుకున్నాయి. భారీ పతనం నుండి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందోననే ఆందోళన కనిపించేలోపు అంతకంటే పైకి లేచి ఇన్వెస్టర్లను మురిపించింది.

2021లోను ర్యాలీ
2020 చివరలో మార్కెట్ ర్యాలీ ప్రారంభమైంది. ఇది 2021లోను కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ 15000 మార్కుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న నిఫ్టీ 14000 మార్కును టచ్ చేసింది. కరోనా కేసులు తగ్గడం, టీకా అందుబాటులోకి రావడం వంటి వివిధ కారణాలతో జనజీవనం సాధారణ స్థితికి వచ్చి, మార్కెట్లకు మరింత ఊపు తీసుకు రావొచ్చు. 2020-21లో భారత జీడీపీ మైనస్ 7 శాతం నమోదవుతుందని, 2021-22లో ప్లస్ 10 శాతం కంటే ఎక్కువగా ఉండవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

15000 మార్కుకు..
నిఫ్టీ ఈ ఆర్థిక సంవత్సరంలో 28 శాతం పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 19 శాతం పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, బ్యాంకులు, లోహాలు, టెలికం రంగాల కంపెనీలు అధిక ఆదాయాలు నమోదు చేయవచ్చు. జనవరి-మార్చి త్రైమాసికంలో నిఫ్టీ 14000 నుండి 1500 స్థాయిలో కదలాడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications