మార్కెట్లకు బ్రేక్! కారణాలివే.. ఇవన్నీ ఎంతో కీలకం
ముంబై: గత కొద్ది రోజులుగా దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు ఈ వారం కాస్త తిరోగమనంలో ఉండే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక సంబంధిత అంశాలతో పాటు డెరివేటివ్ కాంట్రాక్ట్ గడువు ఈ వారంతో ముగియడంతో ఇన్వెస్టర్లుముందు జాగ్రత్తతో అమ్మకాలకు మొగ్గు చూపనున్నారని చెబుతున్నారు. అలాగే, ఈ వారంలో క్రిస్మస్ ఉంది. కాబట్టి ట్రేడింగ్ నాలుగు రోజులకు పరిమితం కానుంది.

సూచీలు కరెక్షన్‌కు గురి కావొచ్చు
సోమవారం నాడు బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ నుంచి టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, యస్ బ్యాంకు, వేదాంతలు వైదొలుగుతున్నాయి. వీటి స్థానాన్ని అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, నెస్లె ఇండియా భర్తీ చేయనున్నాయి. దీని వల్ల మార్కెట్ సూచీలు కరెక్షన్‌కు గురి కావొచ్చునని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టు గడువు గురువారం ముగుస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపే అవకాశాలు తక్కువ అని చెబుతున్నారు. ఇవన్నీ కలిపి గత రెండు వారాల్లో భారీగా వచ్చిన విదేశీ పెట్టుబడిదారులు ఈ వారంలో కొనుగోళ్లు జరపడం తగ్గుతుందని భావిస్తున్నారు.

నిఫ్టీ పాజిటివ్‌గా ఉంటే..
నిఫ్టీ గత సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమై అప్ ట్రెండ్‌ను వారాంతం కొనసాగించింది. చివరకు 200 పాయింట్ల లాభంతో ముగిసింది. మార్కెట్లు ఈ వారం ఇదే సానుకూల వైఖరి కొనసాగిస్తే అప్ ట్రెండ్ 12,300 కంటే పైన నిలదొక్కుకోవచ్చునని, ఫుల్ బ్యాక్ కరెక్షన్‌లో పడినా గతంలో టాప్‌గా ఉండి ఇప్పుడు మద్దతు స్థాయిగా ఉన్న 12,150 కంటే పైన నిలదొక్కుకోవాలని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అంతకంటే దిగజారితే మాత్రం స్వల్పకాలం పడిపోవచ్చునని కూడా చెబుతున్నారు. నిఫ్టీ గత వారం 12,046 నుంచి 12,294 మధ్య కదలాడింది. చివరకు 12,272 వద్ద క్లోజ్ అయింది.

ఇవి కూడా కీలకం..
ఇదిలా ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ముందస్తు సమావేశాలు కూడా చాలా కీలకమని చెబుతున్నారు. ఈ ఏడాది మార్కెట్లు ఆశాజనక తీరును కనబరిచాయి. కొన్ని రంగాలు బలోపేతమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ కదలికలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం, విదేశీ సంస్థాగత పెట్టుపబడిదారుల నిధుల తరలింపు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలని చెబుతున్నారు. సోమవారం ఆర్బీఐ రూ.10వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ రూట్లో విక్రయించే అవకాశముంది. ఆర్బీఐ నిర్ణయాలు ప్రస్తుతానికి మార్కెట్లకు ఉత్తేజాన్నిస్తాయని, దీర్ఘకాలిక బాండ్స్ పైన వడ్డీరేట్లు తగ్గుముఖం పడుతుండటం కూడా మార్కెట్లపై ప్రభావం చూపనుందంటున్నారు.


Click it and Unblock the Notifications