January Market: 2024 జనవరిలో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయ్..? గత 10 ఏళ్లు పరిశీలిస్తే..
Stock Market: గడచిన 10 ఏళ్లుగా స్టాక్ మార్కెట్ల పనితీరును పరిశీలిస్తే జనవరిలో భారత స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా రాబడులను ఇన్వెస్టర్లకు అందించాయి. ప్రస్తుతం మార్కెట్లు గరిష్ఠాలకు చేరుకున్న వేళ కొంత ఆందోళనలు సైతం కొనసాగుతున్నాయి.
గడచిన పదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే.. నిఫ్టీ 50 సూచీ మూడు ఏళ్లు మాత్రమే జనవరిలో పాజిటివ్ ధోరణిని ప్రదర్శించాయి. 2015, 2017, 2018లో మాత్రమే నిఫ్టీ లాభాలను అందించింది. అలాగే సెన్సెక్స్ సూచీ పరితీరును పరిశీలిస్తే.. 2015, 2017, 2018, 2019 జనవరి మాసాల్లో మాత్రమే లాభాలను నమోదు చేశాయి. అయితే ఎక్కువ సార్లు జనవరి బలమైన రాబడులను అందించే నెల కాదని గత చరిత్ర చెబుతోంది.

2014లో నిఫ్టీ సూచీ భారీగా 3 శాతం మేర క్షీణతను నమోదు చేసింది. వేరువేరు సంవత్సరాల్లో గత 10 ఏళ్లుగా జనవరి మాసంలో మార్కెట్ల పనితీరు మారింది. డిసెంబర్ చివరిలో ఐదు రోజుల ర్యాలీ కొనసాగినప్పటికీ.. 2023 చివరి ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్‌లు స్వల్ప నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. నిఫ్టీ-సెన్సెక్స్ రెండూ ఏడాదిలో ఆల్-టైమ్ గరిష్ఠాలకు దగ్గరగా ముగించాయి. కొత్త ఏడాది ప్రారంభంలో మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది.
2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల నుంచి ఊహించిన రాజకీయ స్థిరత్వం, వడ్డీ రేటు తగ్గింపుల అంచనాలతో పాటు, భవిష్యత్తులో సానుకూల మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదం చేస్తుంది. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు 2023లో చాలా వరకు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఇది విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాలను తగ్గించడంలో సహాయపడింది. ఇది మార్కెట్ పనితీరుపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications