Stock Market: బీజేపీ గెలుపుతో మార్కెట్ల రికార్డు ర్యాలీ.. 900 పాయింట్లు దాటిన సెన్సెక్స్..
Market Rally: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక విజయాలను సాధించటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల ర్యాలీని కొనసాగిస్తున్నాయి. రాబోతున్న సార్వత్రిక ఎన్నికలకు వీటిని ఒక ప్రమాణంగా రాజకీయ పార్టీలు తీసుకుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉదయం 9.28 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 971 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 296 పాయింట్ల లాభంతో ముందుకు కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 848 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 437 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుత ర్యాలీలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1000 పాయింట్ల లాభాల మార్కును అందుకునే దిశగా పయనిస్తోంది.

నిన్న జరిగిన నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపులు మూడింటిలో విజేతగా నిలిచిన బీజేపీ క్లీన్ స్వీప్ నమోదు చేసింది. దీంతో మార్కెట్ నిపుణులు ఆశించినట్లుగానే నేడు ఇన్వెస్టర్లు తమ సంతోషాన్ని ట్రేడింగ్ ర్యాలీ రూపంలో కనబరుస్తున్నారు. పైగా మార్కెట్ల నుంచి బేర్స్ తప్పుకోవటంతో ఎన్నికల వేళ బుల్ జోరు కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టి, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, రిలయన్స్, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటోతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో బ్రిటానియా, మారుతీ కంపెనీల షేర్లు మాత్రం ఎన్ఎస్ఈలో నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications