ముంబై: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ముడి చమురు పెరగడం, బంగారం ధరలు పెరుగుతుండటం, రూపాయి క్షీణించడంతో సూచీలు కుప్పకూలాయి. దీంతో పాటు దేశీయ కంపెనీలు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడం కూడా మార్కెట్ సెంటిమెంటును మరింత దెబ్బతీసింది.
ఉదయం గం.9.40 సమయానికి సెన్సెక్స్ 459 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 138 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు క్షీణించి 72.05 వద్ద ట్రేడ్ అయింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.13 నిమిషాలకు 511.28 (1.23%) పాయింట్లు నష్టపోయి 40,953.33 వద్ద, నిఫ్టీ 155.30 (1.27%) పాయింట్లు నష్టపోయి 12,071.35 వద్ద ట్రేడ్ అయింది.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 788 పాయింట్లు నష్టపోయి 40,676.63 వద్ద ట్రేడ్ అయింది. 41వేల మార్క్ దిగువకు చేరుకుంది. గత నాలుగు నెలల కాలంలో ఒక రోజులో సెన్సెక్స్ ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయి 11,993 వద్ద ట్రేడ్ అయింది. గత ఆరు నెలల కాలంలో ఒక రోజులో నిఫ్టీ ఇంతలా పడిపోవడం ఇది మొదటిసారి.

అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అన్ని రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఎస్బీఐ, మారుతీ సుజుకీ, ఆసియన్ పేయింట్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ స్వల్పంగా లాభపడ్డాయి. బంగారం, వెండి ధరలు భారీగా నష్టపోయాయి.


Click it and Unblock the Notifications