ఈ వారం సరికొత్త రికార్డుకు నిఫ్టీ, బంగారం రూ.46,000 దిగువకు పడిపోతుందా?
స్టాక్ మార్కెట్లు గతవారం ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఈ వారం నిఫ్టీ 16800 పాయింట్లకు చేరుకోవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 16100 పాయింట్ల వద్ద మద్దతు ఉంటుంది. 16800 స్థాయిని అధిగమిస్తే 17200 స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఈ వారం నిఫ్టీ బ్యాంకు వెయ్యి పాయింట్లు లేదా అంతకుమించి పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మధ్య, చిన్న వ్యాల్యూ షేర్ల నుండి భారీ వ్యాల్యూ కంపెనీల వైపు నిధులు మళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
నేడు స్టాక్ ఎక్స్చేంజీలో ఎక్సారో టైల్స్, దేవ్యానీ ఇంటర్నేషనల్, విండ్లాస్ బయోటెక్ నమోదవుతుండగా, కృష్ణ డయాగ్నోస్టిక్స్ రేపు నమోదు కానుంది. మొహర్రం నేపథ్యంలో సెలవు ఉండటంతో స్టాక్ మార్కెట్లు ఈ వారం నాలుగు రోజులే పని చేయనుంది. మెటల్ రంగ షేర్లు గతవారం ఒక శాతం నష్టపోయాయి. ఈ వారం స్థిరంగా ఉండవచ్చునని చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నిఫ్టీ మెటల్ సూచీ అత్యుత్తమంగా నిలిచింది.
ఫార్మా రంగం విషయానికి వస్తే స్వల్పకాలంలో వృద్ధికి అవకాశాలు ఉండకపోవచ్చునని చెబుతున్నారు. పలు కంపెనీలు అమెరికా వ్యాపారం అంచనాల కంటే తక్కువగా పుంజుకుంది. ఐటీ కంపెనీల షేర్లు ఈ వారం లాభాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా గత వారం భారీగా లాభపడటంతో ఐటీ సూచీ నాలుగు శాతం మేర లాభపడ్డాయి. కొన్ని టెలికం షేర్లు కూడా పుంజుకునేఅవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ కుదుపుకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి.

ముడిపదార్థాల వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో FMCG కంపెనీలు ఈ భారాన్ని కస్టమర్ల పైకి బదలీ చేసే అవకాశముంది. ద్రవ్యోల్బణం పెరుగుతుండడం ఆందోళన కనబరుస్తోంది. వాహన కంపెనీల షేర్లు కీలక సూచీల నుండి సంకేతాలు అందుకోవచ్చు. వచ్చేది పండుగ సీజన్ కాబట్టి వాహన డిమాండ్ పుంజుకుంటుందని భావిస్తున్నారు. చమురు కంపెనీల షేర్లు ప్రతికూల ధోరణితో స్థిరీకరణకు గురి కావొచ్చునని అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ నుండి వచ్చే సంకేతాలకు అనుగుణంగా దేశీయ సూచీలు కదలాడవచ్చు. ఆగస్ట్ 19వ తేదీన మొహర్రం పండుగ. ఈ రోజు సెలవు దినం. హోల్ సేల్ ద్రవ్యోల్భణం, ఎగుమతులు-దిగుమతుల గణాంకాలు వెల్లడవుతున్నాయి. జూలై నెలలో హోల్ సేల్ ద్రవ్యోల్భణం కాస్త పెరిగే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 70.6 డాలర్ల వద్ద ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు FPIలు రూ.2085 కోట్లు చొప్పించగా, డెట్ విభాగంలో రూ.2044 కోట్లు వెనక్కి తీసుకున్నారు.
గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్ ఈవారం రూ.46,296 కంటే దిగువన కదిలితే రూ.46,060కు, రూ.45,630 స్థాయి వరకు కూడా పడిపోయే అవకాశం లేకపోలేదని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ రూ.46,300 కంటే కిందకు రాకుంటే రూ.47,397 వరకు పెరగవచ్చు. సిల్వర్ సెప్టెంబర్ కాంట్రాక్ట్ ఈ వారం రూ.63,936 కంటే పైన కదిలితే రూ.64,763, రూ.66,323 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications