సెన్సెక్స్ 50,500, నిఫ్టీ 15,000! వచ్చే ఏడాది ఇదే దూకుడు, కానీ షరతులు వర్తిస్తాయి..
ముంబై: స్టాక్ మార్కెట్లు ఇటీవల దుమ్మురేపుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ కాలంలో మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆగస్ట్, సెప్టెంబర్ కాలం నుండి కార్యకలాపాలు పుంజుకోవడంతో సూచీలు మరింతగా ఎగుస్తున్నాయి. కరోనా వ్యాక్సీన్ పైన సానుకూల ప్రకటన, వ్యాక్సీనేషన్‌కు అమెరికా సహా వివిధ దేశాలు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈక్విటీ మార్కెట్లు మరింతగా పైకి లేస్తున్నాయి. గత నెలపది రోజుల కాలంలోనే అంటే నవంబర్ మొదటి వారం నుండి గత వారం నాటికి సెన్సెక్స్ ఏకంగా 42వేల నుండి 46వేలకు ఎగిసిపడింది. వ్యాక్సీన్ పైన సానుకూల ప్రకటనలతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం కలిసి వస్తుంది. దీంతో సూచీలు కొత్త శిఖరాలను తాకుతున్నాయి.

వచ్చే ఏడాది ఇదే దూకుడు
2021 చివరి నాటికి సెన్సెక్స్ 50,500 మార్కును, నిఫ్టీ 15,000 మార్కును తాకే అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం సూచీలు బలంగానే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు చివరలోను అదే ఒరవడి కొనసాగుతోందని పేర్కొంది. వ్యాక్సీన్, వ్యాక్సినేషన్ నేపథ్యంలో 2021 క్యాలెండర్ ఏడాదిలోను సూచీలు దూసుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

బ్రోకరేజీ సంస్థలు ఏం చెప్పాయంటే
డిసెంబర్ 2021 నాటికి నిఫ్టీ 15,000 మార్కును దాటవచ్చునని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. అదే సమయంలో సెన్సెక్స్ 50,500 మార్కును తాకుతుందని మరో బ్రోకరేజీ సంస్థ BNP పరిబాస్ అంచనా వేసింది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కొద్ది నెలలుగా సూచీలు దూసుకెళ్తున్నాయని, ఇందుకు ప్రధాన కారణం లిక్విడిటీ అని జేపీ మోర్గాన్ తెలిపింది.

షరతులు వర్తిస్తాయి.... వీటిపై ఆధారపడి
ప్రభుత్వ చర్యలు, భౌగోళిక రాజకీయ అంశాలపై కరోనా పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలపై ఆధారపడి సూచీలు వచ్చే ఏడాది చివరి నాటికి ఆ మార్కుకు చేరుకోవచ్చునని BNP పరిబాస్ పేర్కొంది. వ్యాక్సీన్ ప్రభావం తక్కువగా ఉండటం, ద్రవ్యోల్భణం, భౌగోళిక రాజకీయ, పరిపాలనా రిస్క్, వ్యాల్యుయేషన్స్ వంటి వివిధ అంశాలపై సూచీల రికార్డులు ఆధారపడి ఉండవచ్చునని తెలిపింది. అంటే పై అంశాలపై ఆధారపడి సూచీలు పై అంచనాలను తాకుతాయి.


Click it and Unblock the Notifications