భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, బలపడుతున్న రూపాయి
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (జూన్ 9) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 109.17 పాయింట్లు లేదా 0.32% ఎగిసి 34,479.75 వద్ద, నిఫ్టీ 32.00 పాయింట్లు లేదా 0.31% పెరిగి 10,199.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 829 షేర్లు లాభాల్లో, 144 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 33 షేర్లలో ఎలాంటి మార్పులేదు. కాసేపు ఊగిసలాటలో కనిపించాయి. ఆ తర్వాత సెన్సెక్స్ 400 పాయింట్ల వరకు పెరిగింది. డాలర్ మారకంతో రూపాయి 75.52 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్‌లో 75.54 వద్ద ముగిసింది.
ఉదయం గం.11 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, సన్ ఫార్మా, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఇన్ఫ్రాటెల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో గెయిల్, టైటాన్ కంపెనీ, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐవోసీ ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాభాల్లోకి వచ్చాయి. ఈ రోజు 23 కంపెనీలు క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇందులో హీరో మోటా కార్ప్, బాంబే డైయింగ్ సంస్థలు ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

నిన్న స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో భారీ లాభాలు మూటగట్టుకొని, క్లోజింగ్ సమయానికి స్వల్ప లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే. జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ నిన్న ఆరంభంలో 2.74 శాతం పెరిగి గరిష్ట రూ.1624కు చేరుకుంది. చివరకు 0.67 శాతం లాభంతో రూ.1570 వద్ద ముగిసింది. ఈ రోజు ఉదయం గం.11 సమయానికి 0.20 శాతం తగ్గి రూ.1569.30 వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications