Market Crash:15 నిమిషాల్లో రూ.5.2 లక్షల కోట్లు ఆవిరి, మార్కెట్ భారీ పతనం
స్టాక్ మార్కెట్లు సోమవారం(డిసెంబర్ 20) భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమైంది. ఈ రెండు సూచీలు కూడా ప్రారంభంలోనే దాదాపు 2 శాతం మేర క్షీణించాయి. కేంద్ర ఆర్థిక శాఖ వరి, గోధుమ, శనగలు, ఆవాలు, సోయా బీన్స్, ముడి పామాయిల్, పెసర కమోడిటీ ట్రేడింగ్‌ను ఏడాదిపాటు నిలిపివేయాలని సెబీని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రభావం మార్కెట్ పైన పడింది. అలాగే, శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఆసియా మార్కెట్లు నేడు నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి.
సెన్సెక్స్ ఉదయం 56,517.26 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఏ దశలోను కనీసం క్రితం సెషన్ ముగింపు స్థాయికి చేరుకోలేదు. ఈ అరగంటలో 56,538 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. 55,840 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.10.00 సమయానికి 1,057.05 (1.85%) పాయింట్లు నష్టపోయి 55,954.69 వద్ద ముగిసింది.

నిఫ్టీ 16,824.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,840.10 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,635.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఉదయం గం.10 సమయానికి 330.20 (1.94%) నష్టపోయి 16,655.00 పాయింట్ల వద్ద ముగిసింది.మార్కెట్ నష్టాల నేపథ్యంలో ఉదయం 15 నిమిషాల్లోనే ఈక్విటీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ.5.2 లక్షల కోట్లు నష్టపోయారు. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.254 లక్షల కోట్లకు పడిపోయింది.
వివిధ రంగాలు భారీగా నష్టపోయాయి. అత్యధికంగా రియాల్టీ దాదాపు 4 శాతం కూడా నష్టపోయింది. ఉదయం గం.10 సమయానికి నిఫ్టీ బ్యాంకు 3.04 శాతం, నిఫ్టీ ఆటో 2.79 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.69 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.71 శాతం, నిఫ్టీ ఐటీ 0.98 శాతం, నిఫ్టీ మీడియా 1.61 శాతం, నిఫ్టీ మెటల్ 3.15 శాతం, నిఫ్టీ ఫార్మా 0.20 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.18 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.95 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.26 శాతం, నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ 0.23 శాతం, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.65 శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 2.76 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications