Paytm News: పేటీఎం పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చిన NSE, BSE.. రేపటి నుంచి అమలు..
Paytm Crisis: గడచిన నాలుగు రోజులుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విషయంలో రిజర్వు బ్యాంక్ నిర్ణయం అనేక గందరగోళాలకు దారితీస్తోంది. దీనిపై తాజాగా స్పందించిన కంపెనీ ఎలాంటి ఈడీ చర్యలు తమపై లేవంటూ క్లారిటీ ఇచ్చింది.
పేటీఎం షేర్లపై భారతీయ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడిదారుల్లో తీవ్ర భయాలు అలుముకున్న సంగతి తెలిసిందే. దీంతో వారు అమ్మకాలకు దిగటం పెద్ద గందరగోళానికి దారితీసింది. దీంతో మెుదటి రోజు షేర్ల ధర 20 శాతం క్షీణించి కుప్పకూలింది. అయితే అదే ధోరణి రెండవ రోజు సైతం కొనసాగటంతో మరో 20 శాతం మేర షేర్ ధర కుప్పకూలిపోయింది. మెుత్తంగా రెండు రోజుల్లో షేర్ ధర ఏకంగా 40 శాతం మేర పడిపోయింది. రిజర్వు బ్యాంక్ అకస్మాత్తు నిర్ణయం కారణంగా కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 2 బిలియన్ డాలర్ల మేర క్షీణతకు గురైంది.

ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులను రక్షించేందుకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీతో పాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం షేర్ల రోజువారీ ట్రేడింగ్ పరిమితులను 10 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీనికి ముందు రోజువారీ సర్క్యూట్ పరిమితి 20 శాతంగా ఉండేది. వరసగా రెండు రోజుల పాటు దేశీయ స్టాక్ మార్కెట్లలో జరిగిన అల్లకల్లోలంతో పేటీఎం కంపెనీ విలువ భారీగా క్షీణించి 3.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
వాస్తవానికి కేవైసీకి సంబంధించిన నియమాలను పాటించటంలో కంపెనీ విఫలమవ్వటంతో పాటు మనీలాండరింగ్‌కి సంబంధించిన ఆందోళనల కారణంగా రిజర్వు బ్యాంక్ కఠినంగా వ్యవహరించింది. దీంతో మార్చి నుంచి వాలెట్లలో కొత్త డిపాజిట్లను స్వీకరించడం, కొత్త టాప్-అప్‌లను నిలిపివేయమని పేటీఎం బ్యాంకింగ్ విభాగాన్ని ఆర్బీఐ ఆదేశించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు తీసుకున్న రక్షణాత్మక నిర్ణయం పేటీఎం షేర్లలో ఎక్కువ ఒడిదొడుకులను తగ్గించేందుకు తోడ్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications