కొవిడ్ కారణంగా ప్రైవేట్ రంగం పెట్టుబడి ప్రణాళికలు దెబ్బతినడంతో.. మూలధనం, మౌలిక సదుపాయాల కల్పన వ్యయాన్ని కొంత కాలంగా ప్రభుత్వ రంగమే భరిస్తోంది. ఆర్థిక సంస్థలు నెమ్మదిగా కోలుకుంటుండగా.. గడచిన పదేళ్లలో ప్రభుత్వ రంగం పెట్టుబడి 6.8 ట్రిలియన్ రూపాయల నుంచి 21.2 ట్రిలియన్లకు పెరిగినట్లు ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ గత నెలలో పెర్కొన్నారు.

అంచనాలకు మించి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను 7.5 ట్రిలియన్లు మూలధన వ్యయం కోసం ఖర్చుపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గతేడాది బడ్జెట్ అంచనాల కంటే ఇది దాదాపు 35 శాతం ఎక్కువ. ఇందులో రాష్ట్రాలు తమ మూలధన అవసరాలను తీర్చుకోవడానికి వడ్డీ రహిత, దీర్ఘకాలిక రుణంగా 1 ట్రిలియన్ ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రాలు వివిధ ప్రాజెక్టుల్లో తమ పెట్టుబడులను పెంచుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు.

కేంద్రం సాయం చేసినా..
కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ (కాగ్) వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల సమాచారం విశ్లేషిస్తే కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. 10 అతిపెద్ద రాష్ట్రాల్లో ఏడు రాష్టారాలు.. బడ్జెట్‌లో పేర్కొన్న స్థాయిలో మూలధన వ్యయం ఖర్చు చేయలేదని తెలుస్తోంది. కేంద్రం నుంచి అదనపు సహాయం అందినా, మూలధన వ్యయంపై దృష్టి పెట్టాలని పదేపదే చెబుతున్నా కార్యరూపం దాల్చలేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

మూడు రాష్ట్రాలే బెటర్
ఉన్నపళంగా మూలధన వ్యయం పెంచే సామర్థ్యం రాష్ట్రాలకు లేకపోవడం, గత రెండేళ్లలో ఎన్నికలు జరగడం, అనేక రాష్ట్రాలు సబ్సిడీ వ్యయంపై ముఖ్యంగా దృష్టి పెట్టడమూ ఇందుకు కారణమని భావిస్తున్నట్లు ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారు డీ కే శ్రీవాస్తవ పేర్కొన్నారు. కేవలం గుజరాత్, కర్నాటక, పశ్చిమ బెంగాల్ మాత్రమే లక్షంలో దాదాపుగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications