ఆంధ్రప్రదేశ్ ను పారిశ్రామికంగా అభివృద్ధి బాటలో నడిపించాలని జగన్ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తన క్యాంపు కార్యాలయంలో తాజాగా జరిగిన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు(SIPB) సమావేశంలో CM జగన్ పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందాలన్న నియమాన్ని తప్పక అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
పరిశ్రమలు శుద్ధిచేసిన, డీ శాలినేషన్ నీటినే వినియోగించుకునేలా పర్యవేక్షించాలని CM సూచించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగు, సాగునీరు కొరత రాకుండా చూడాలంటే డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలే శరణ్యమన్నారు. ఇజ్రాయిల్ తరహ నీటి సంరక్షణ విధానాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రైతుల నుంచి ఆయా కంపెనీలు కొనుగోలు చేసే పంటలకు కనీస మద్ధతు ధర చెల్లించేలా చూడాలన్నారు.

YSR జిల్లా వేంపల్లె మండలంలో 1500 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు SIPB ఆమోదం తెలిపింది. తద్వారా దాదాపు 3315 మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తితో పాటు 1500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ అనుబంధ సంస్థ క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఆధారంగా 225 మెగావాట్ల సోలార్, 150 మెగావాట్ల విండ్ పవర్ ఉత్పత్తి చేయడానికి నిర్ణయించారు.
విశాఖ జిల్లా అన్నవరంలో హెటళ్లు మరియు రిసార్టుల అభివృద్ధి చేసి దాదాపు 1750 మందికి ఉద్యోగాలు కల్పిచడంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 1200 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సమీపంలో ప్రారంభించనున్న హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఏకంగా 3 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్షంగా పెట్టుకున్నారు. నెల్లూరులో వంటనూనె ఉత్పత్తి ఫ్యాక్టరీని నెలకొల్పనున్నారు.
తిరుపతి పేరూరులో 218 కోట్లతో అభివృద్ధి చేయతలచిన హయత్ ఇంటర్‌నేషనల్ హోటల్ ద్వారా దాదాపు 1500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వరదాయ పాలెం మండలం కువ్వకోలి వద్ద CCL పుడ్ మరియు బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ ద్వారా వెయ్యి మందికి ఉపాధి దొరకడమే కాక కాఫీ సాగుచేస్తున్న రెండున్నర వేల మందికి లబ్ధి చేకూరనుందని భావిస్తున్నారు. శ్రీసిటీ వద్ద కోకో తయారీ ఫ్యాక్టరీపైనా నిర్ణయం తీసుకున్నారు.


Click it and Unblock the Notifications