For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వైరస్ దెబ్బ: మీరైనా ఇవ్వండి... అప్పుకైనా అనుమతించండి!: కేంద్రానికి రాష్ట్రాల మొర

|

దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఒక వైపు రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులతో బెంబేలెత్తిపోతుండగా... మరో వైపు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. 21 రోజుల లాక్ డౌన్ తో అన్ని రకాల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోగా... రాష్ట్రాలకు రావలసిన రెవిన్యూ రాబడులు తగ్గిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి తెలెత్తింది. దీంతో ఉద్యోగుల జీతాల్లో కోత విధించటంతో లేదా రెండు దఫాలుగా వాటిని చెల్లించటమో చేస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితి మరో నెల రోజులు ఇలాగే కొనసాగితే ఇంకా దయనీయంగా తయారయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం వైపు చూస్తున్నాయి. విన్నపాలు వినవలె అంటూ కేంద్ర తలుపు తడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నుంచి తమను ఎలాగైనా గట్టెక్కించాలని కోరుతున్నాయి.

జీఎస్టీ బకాయిల చెల్లింపు...

జీఎస్టీ బకాయిల చెల్లింపు...

జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు మధ్య పంపకాల విషయంలో కొన్ని పొరప్పొచ్చళ్లున్నాయి. తమకు రావాల్సిన వాటా నిధులను కేంద్రం సకాలంలో చెల్లించటం లేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అయితే ఈ విషయాన్ని బహిరంగంగానే వెల్లడించారు. జీఎస్టీ బకాయిల సహా రాష్ట్రానికి సుమారు పది వేల కోట్ల వరకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ది కూడా ఇలాంటి పరిస్థితే. దీనికి రాజస్థాన్, పంజాబ్, బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా కేంద్రంపై ఈ విషయంలో గుర్రుగా ఉన్నాయి. అందుకే, ప్రస్తుత కష్టకాలంలో అయినా వెంటనే జీఎస్టీ చెల్లింపులు చేయాలనీ అవి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా పలు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. అయితే, కేంద్రం పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. ప్రతి నెల జీఎస్టీ కలెక్షన్లు రూ 1 లక్ష కోట్ల లోపే వసూలు అవుతున్నాయి. ఎదో రెండు మూడు నెలలు మినహాయిస్తే... ఎప్పుడు కూడా ప్రభుత్వ అంచనాలను అందుకోలేదు. అయినప్పటికీ... లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కేంద్రం కొంత మొత్తంలో రాష్ట్రాలకు బకాయిలను చెల్లించింది.

అప్పులకు అనుమతి...

అప్పులకు అనుమతి...

ఒక వేల కేంద్రం తమకు రావాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించలేక పోతే ... కనీసం తాము అప్పులు తెచ్చుకునేందుకు అనుమతి అయినా ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఇందుకోసం ఎఫ్ ఆర్ బీ ఎం చట్టంలో కొంత వెసులుబాటు కల్పించాలని అభ్యర్థిస్తున్నాయి. ఎఫ్ ఆర్ బీ ఎం లో కనీసం 50 బేసిస్ పాయింట్ల నుంచి 100 బేసిస్ పాయింట్ల వరకు సడలింపు ఇస్తే... ఒక్కో రాష్ట్రం సగటున రూ 1 లక్ష కోట్ల వరకు కొత్తగా రుణాలు తెచ్చుకునే అవకాశం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. సాధారణంగా ఎఫ్ ఆర్ బీ ఎం చట్టం ప్రకారం ఒక రాష్ట్ర జీ ఎస్ డీ పీ లో 3% వరకు అప్పులకు కేంద్రం అనుమతి ఇస్తుంది. ప్రత్యేక సందర్భంలో దీనిని 3.5% చేసే వెసులుబాటు కూడా ఉంది. రెవెన్యూ మిగులు ఉన్న గుజరాత్, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఈ పరిమితిని పెంచాలని ఎప్పటి నుంచో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఉచిత రేషన్... ఆర్థిక సహాయం..

ఉచిత రేషన్... ఆర్థిక సహాయం..

దేశంలో కాస్త ఆలస్యంగా ప్రవేశించిన కరోనా వైరస్... లాక్ డౌన్ తో కొంత అదుపులోనే ఉంది. కానీ ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారితో పరిస్థితి అదుపు తప్పింది. ప్రస్తుతం దేశంలో 4,067 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇప్పటికే 109 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ లో ఉన్న ప్రజలను, ముఖ్యంగా పేద ప్రజలను ఆదుకునేందుకు ఉచిత రేషన్ తో పాటు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాయి. తెలంగాణ లో ఒక్కొక్క కుటుంబానికి రూ 1,500 ఆర్థిక సహాయం చేస్తుండగా.. ఆంధ్ర ప్రదేశ్ లో ఇది రూ 1,000 గా నిర్ణయించారు. ఈ రెండు కార్యక్రమాల కోసమే ఒక్క తెలంగాణ లోనే సుమారు రూ 2,400 కోట్ల నిధులను వెచ్చిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోనూ దాదాపు ఇదే స్థాయిలో వ్యయం అవుతోంది. ఒకవైపు కేంద్ర నిధుల రాకలో ఆలస్యం, మరో వైపు రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడటంతో రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి.

English summary

కరోనా వైరస్ దెబ్బ: మీరైనా ఇవ్వండి... అప్పుకైనా అనుమతించండి!: కేంద్రానికి రాష్ట్రాల మొర | State governments are finding it difficult to manage their finances

In the wake of Corona virus, the state governments are finding it difficult to manage their finances. To tide over the current situation, the state governments are urging the central government to release the GST pending bills on time and also requesting the centre to allow them to borrow additionally. They request the centre to amend the FRBM act to provide some relief to the state governments in the uncertain times.
Story first published: Tuesday, April 7, 2020, 18:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X