Q1 Results: దేశీయంగా చాలా మంది ఇన్వెస్టర్లు ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెుదటి త్రైమాసిక ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్బీఐ అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది.
శనివారం వెలువరించిన జూన్ త్రైమాసిక ఫలితాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం రూ.17,035 కోట్లుగా నమోదైంది. ఇది గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం కంటే అధికం. ఏడాది క్రితం ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ లాభం రూ.16,884.29 కోట్లుగా ఉంది. ఈసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల కంటే మెరుగ్గా ఉంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ వడ్డీ ద్వారా రూ.1,11,526 కోట్లు ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే 16 శాతం ఎక్కువగా ఉంది.

అలాగే జూన్ త్రైమాసికంలో బ్యాంకు ఖర్చు చేసిన వడ్డీ రూ.70,401 కోట్లుగా ఉంది. ఇది వార్షిక ప్రాతిపదికన రూ.57,041 కోట్ల కంటే 23 శాతం ఎక్కువ. జూన్ 30 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల NPA నిష్పత్తి 2.21 శాతంగా ఉంది. మార్చి 31 వరకు 2.24 శాతంగా ఉంది. జూన్ 30, 2023 వరకు ఈ నిష్పత్తి 2.76 శాతంగా ఉంది. జూన్ 30 నాటికి బ్యాంక్ నికర NPA 0.57 శాతంగా ఉంది. మార్చి 31 వరకు కూడా 0.57 శాతంగా ఉంది.
జూన్ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.41,125 కోట్లుగా ఉంది. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే 5.71 శాతం ఎక్కువ. జూన్ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహణ లాభం రూ.26,449 కోట్లుగా ఉంది. ఎస్‌బీఐ షేరు శుక్రవారం 1.72 శాతం క్షీణతతో రూ.847.90 వద్ద ముగిసింది. గత ఏడాది కాలంలో ఎస్‌బీఐ షేర్ల ధరలు 41.70 శాతం పెరిగాయి. గడచిన ఆరునెలలుగా స్టాక్ హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లు దాదాపు 30.50 శాతం లాభాన్ని అందుకున్నారు.


Click it and Unblock the Notifications