SBI: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి మారనున్న విత్ డ్రా నిబంధనలు..
మరో ఐదు రోజుల్లో అక్టోబర్ లోకి అడుగు పెట్టబోతున్నాం. ఆర్థిక అంశాలకు సంబంధించి అక్టోబర్ లో అనే మార్పులు రానున్నాయి. అక్టోబర్ 15 నుంచి వ్యాపారులకు చేసే రూ.2 వేల కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. అంతేకాదు దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లావాదేవీలకు సంబంధించి కీలక మార్పులు కూడా అక్టోబర్ 1 నుంచి అమలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలపై నగదు ఉపసంహరణ ఛార్జీలను అక్టోబర్ 1 నుంచి సవరించనుంది. నెలకు నాలుగు సార్లు ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణలు ఉచితంగానే కొనసాగుతాయి.
అయితే నెలలో నాలుగుకు మించిన విత్ డ్రా చేస్తే ప్రతి లావాదేవీకి రూ.15 తో పాటు జిఎస్‌టి ఛార్జీ విధిస్తామని ఎస్బీఐ తెలిపింది. అయితే డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని పేర్కొంది.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా జరిపే లావాదేవీలకు సంబంధించిన నిబంధనలను కూడా ఎస్‌బీఐ సవరించింది. గతంలో AePS ద్వారా జరిపే లావాదేవీలను డిజిటల్ లావాదేవీలుగా పరిగణించేవారు. వాటిని నెలకు నాలుగు ఉచిత నగదు విత్ డ్రా పరిమితిలో చేర్చేవారు కాదు. అయితే ఎస్‌బీఐ ఇప్పుడు ఈ మినహాయింపును తీసేసింది. AePS ద్వారా చేసే నగదు ఉపసంహరణలు కూడా కొత్త నిబంధనలకు లోబడి ఉండనున్నాయి.

అలాగే ఆర్బీఐ ఎఫ్డీలకు సంబంధించి నిబంధనలు కూడా మార్చింది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను 'బల్క్ డిపాజిట్లు'గా పరిగణిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు ఇప్పుడు లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) విధానం కింద బల్క్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లను అందించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లను నిర్ణయించడంలో బ్యాంకులకు మరింత వెసులుబాటు కల్పించడం కోసం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు తమ FD వడ్డీ రేట్లను తమ వెబ్‌సైట్‌లలో స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం బల్క్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేట్లను ప్రతి పని దినం ఉదయం 10 గంటల లోపు బ్యాంక్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలి.
తాజా వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఉదయం 10:10 గంటల లోపు అప్‌డేట్ చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకే రోజున బుక్ చేసుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఖచ్చితంగా ఒకేలా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యాంక్ ఏ శాఖలోనైనా, ఒకే రోజున బుక్ చేసుకున్న ఒకే మొత్తానికి సంబంధించిన FDల వడ్డీ రేట్లలో ఎటువంటి తేడా (వివక్ష) ఉండకూడదు.
కాగా భారతదేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన ఎస్‌బీఐ, ఆగస్టు 11న ఐదేళ్ల బాండ్ల ద్వారా 500 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్లు ప్రకటించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
