Space Industry: భారత అంతరిక్ష రంగం సాధించిన ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలు భళా భారత్ అనే రేంజ్ లో సక్సెస్ సొంతం చేసుకుంది. అగ్ర రాజ్యాలు సైతం అందుకోలేని కీర్తి సంపాదించింది. వరుస విజయాలతో అలరారుతున్న ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు పలు స్టార్టప్ కంపెనీలు సైతం ముందుకు వచ్చాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా దేశీయ అంతరిక్ష రంగం రూపురేఖలు మారిపోయాయి.
అంతరిక్ష రంగం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే కారణమని సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. దాని ఫలితంగానే గత రెండేళ్లలో స్పేస్ స్టార్టప్ ల సంఖ్య ఏకంగా 200 రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహించినట్లు గుర్తు చేశారు. 2021తో పోలిస్తే 2030 నాటికి గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా 4 రెట్లు పెరగనుందని భావిస్తున్నట్లు చెప్పారు.

అంతరిక్ష విభాగానికి సంబంధించి 100 రోజుల ప్రణాళిక, దేశ స్పేస్ రంగం ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తు అవకాశాలు, ఇతర మిషన్ల గురించి నిర్వహించిన సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను సమీక్షించారు. కేవలం గత 8 నెలలోనే దాదాపు వెయ్యి కోట్లు ఈ రంగంలోకి పెట్టుబడులుగా వచ్చినట్లు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు.
ప్రధాని మోదీ ప్రకటించిన 'అమృత్ కాల్' సమయంలో 'సబ్కా ప్రయాస్'లో భాగంగా అంతరిక్ష రంగంలో 450 MSMEలు నెలకొల్పబడ్డాయన్నారు. ప్రపంచ స్పేస్ ఇండస్ట్రీలో భారత అంతరిక్ష రంగం వాటా 2 శాతంగా ఉన్నట్లు తెలిపారు. ఇది 2030 నాటికి 8, 2047 నాటికి 15 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ రంగంలో భారీ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నట్లు చూస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications