Layoff News: ఒకేసారి 150 మందిని తొలగించిన స్టార్టప్.. ఫండింగ్ రావటంతోనే..
Udaan News: 2023 స్టార్టప్ కంపెనీలకు అత్యంత గడ్డు కాలాన్ని పరిచయం చేసింది. ఇది వాటి పనితీరును మార్చుకోవాల్సిన ఆవశ్యకతను సైతం చెప్పింది. దీంతో చాలా కంపెనీలు నిధుల కోసం పడరాని పాట్లు పడుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా B2B ఈ-కామర్స్ స్టార్టప్ యూనీకార్న్ ఉడాన్ మెుత్తం ఉద్యోగుల్లో 10 శాతం అంటే 150 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ముందు కంపెనీ 340 మిలియన్ డాలర్లను మూలధన అవసరాల కోసం ఫండింగ్ రూపంలో పొందింది. ప్రస్తుతం పొందిన ఫండింగ్ ద్వారా ఉడాన్ తన సరఫరా గొలుసును బలోపేతం చేయటంతో పాటు విక్రేత భాగస్వామ్యాన్ని పెంచాలని ప్లాన్ చేస్తోంది.

కంపెనీ తాను పనిచేసే విధానంలో చేసిన మార్పుల కారణంగా ఉద్యోగుల తొలగింపులను చేపట్టినట్లు వెల్లడైంది. ఉడాన్ పునర్నిర్మాణం వల్ల అన్ని రోల్స్, విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఈ క్రమంలోనే కంపెనీ తన కార్యక్రమాలను వికేంద్రీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కార్యకలాపాలు క్లస్టర్ వారీగా ఉంటాయని సమాచారం. లాభదాయకమైన వ్యాపారాన్ని నిర్మించే దిశగా తమ ప్రయాణంలో కంపెనీ ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
గత నవంబర్‌లో కూడా 120 మిలియన్ డాలర్ల కన్వర్టిబుల్ నోట్లను సేకరించిన తర్వాత ఉడాన్ 10 శాతం ఉద్యోగులను తొలగించింది. జూన్, నవంబర్‌లలో రెండు రౌండ్ల లే-ఆఫ్‌లలో గత ఏడాది 500 మంది ఉద్యోగులను తొలగించింది. 2025లో కంపెనీ తన ఐపీవోను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఉడాన్‌ను 2016లో ముగ్గురు ఐఐటీ పూర్వ విద్యార్థులు అమోద్ మాల్వియా, సుజీత్ కుమార్, వైభవ్ గుప్తా స్థాపించారు. దీనికి ముందు వీరంతా ఫ్లిప్‌కార్ట్‌లో కూడా పనిచేశారు.


Click it and Unblock the Notifications