Trending: ఇండియా విడిచి వెళ్లిపోవాలంటున్న స్టార్టప్ సీఈవో.. పాప్‍కార్న్ టాక్స్ బ్లాస్టింగ్..
Tax on Popcorn: గడచిన కొన్నేళ్లుగా భారతదేశంలో పన్నులు భారీగానే పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు సైతం రోజురోజుకూ కొత్త పన్నులను చూసి విసిగిపోతున్నారు. వస్తున్న సంపాదన కంటే ఖర్చులు, పన్నులు అధికంగా ఉండటం చాలా మందిని నిరుత్సాహపరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే పన్నులపై నెట్టింట తీవ్ర విమర్శలు మెుదలయ్యాయి.
గతవారం జరిగిన జీఎస్టీ సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫేవరెట్ స్నాక్స్ ఐటమ్ పాప్‍కార్న్ పై విధిస్తున్న పన్ను రేటును పెంచుతూ నిర్ణయం తీసుకోవటం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తొలగించబడిన రెడ్డిట్ పోస్ట్‌లో ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు భారత్‌ను వదిలివేయాలని, అందుకు ఇదే సరైన సమయంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వాస్తవానికి ఇండియా గొప్ప దేశమైనప్పటికీ.. ఆవిష్కరణలను పెంపొందించడానికి ఇక్కడ ఉత్తమ వాతావరణం లేదని సదరు సీఈవో పోస్టులో పేర్కొన్నారు. అలాగే హై పెయిడ్ శాలరీలు పొందే వ్యక్తులు ఇండియాను వదిలి విదేశాలకు వెళ్లాలని పోస్టులో పేర్కొనటం పెద్ద చర్చకు దారితీసింది. అయితే ప్రస్తుతం ఈ పోస్టును రెడిట్ తొలగించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పోస్టు తొలగించబడినప్పటికీ.. ఈ చర్యకు ముందే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తాను అగ్రశ్రేణి భారతీయ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నానని, తర్వాత అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందానని వెల్లడించిన యూజర్ 2018లో తాను ఇండియాకు తిరిగి వచ్చి స్టార్టప్ కంపెనీని ప్రారంభించినట్లు వెల్లడించారు. తన కంపెనీలో సగటున రూ.15 లక్షల వేతనంతో దాదాపు 30 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు అతడు వెల్లడించాడు. మూర్ఖపు నిబంధనలు ఇండియాలో ఆవిష్కరణలను అణచివేస్తున్నాయని, ఏదైనా సాధించడానికి బ్యూరోక్రాట్‌లు, రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీలతో సంబంధాలు అవసరమని యూజర్ పేర్కొన్నాడు. అలాగే వివిధ సర్వీస్ ప్రొవైడర్ల నుండి తరచుగా "ప్రాంతీయ ద్వేషాన్ని" అనుభవిస్తున్నట్లు కూడా వ్యవస్థాపకుడు వివరించాడు.
ఈ క్రమంలో రోడ్లు, ఆసుపత్రులతో పాటు అధికంగా ఉన్న పన్నుల గురించి కూడా సదరు సీఈవో ప్రస్థావించారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఇండియాలో పాప్‍కార్న్ వంటి స్నాక్స్ పై భారీగా పన్నులు వేయటంపై కూడా వ్యంగంగా స్పందించారు. ఈ క్రమంలో రాబోయే "భయంకరమైన ఆర్థిక పతనం" రూపాయి క్షీణత గురించి హెచ్చరించాడు. ఆవిష్కరణలపై మక్కువ ఉన్న వ్యక్తులు యూఏఈ,థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లాలని సదరు వ్యాపారవేత్త సూచించారు. ప్రస్తుతం ఈ పోస్టు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications